కోమటిరెడ్డి వెంకటరెడ్డికీ మరో ఆప్షన్ లేకుండా పోతోందా.?

కాంగ్రెస్ పార్టీలో కొనసాగే ఉద్దేశ్యం వుంటే, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పదే పదే విమర్శలు చేయాల్సిన పనిలేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ‘రేవంత్ రెడ్డి కంటే నేనే సీనియర్.. నాకే ఎక్కువ ఫాలోయింగ్.. అధిష్టానం వద్ద నా పరపతి వేరే..’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే చెబుతుంటారు. అదే నిజమైతే, వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్షుడవుతారుగానీ, రేవంత్ రెడ్డి ఎందుకు పీసీసీ అధ్యక్షుడవుతారు.?

పైగా, తన సోదరుడే కాంగ్రెస్ పార్టీని వీడుతోంటే, ‘నేను స్పందించను..’ అనేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు వుంటారని ఎలా అనుకోగలం.? ముందైతే ప్రయోగాత్మకంగా సోదరుడ్ని పార్టీ నుంచి బయటకు పంపి, బీజేపీలో చేర్చుతున్నారు.. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళిపోతారు.. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోన్న చర్చ.

‘నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి..’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సెలవిచ్చారు. ఇటీవల మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో, ఓ కాంగ్రెస్ కీలక నేత, వెంకటరెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది. ఆయన క్షమాపణ కూడా చెప్పాడు.

అక్కడితో వివాదం ముగిసిపోలేదు. మళ్ళీ వివాదాన్ని రాజేస్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి.. అంటే, అది జస్ట్ పేరు కాదు, బ్రాండ్.! కోమటిరెడ్డి బ్రదర్స్.. అంటూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోల్డంతమంది అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు హంగామా చేస్తంటారు. అలాంటిది, ఆ బ్రదర్స్ విడిపోతే అభిమానుల పరిస్థితేంటి.? అభిమానులకైతే ఇద్దరు అన్నదమ్ములూ కలిసి కట్టుగా ఎలాంటి సంకేతమూ అధికారికంగా పంపలేదు.

అనధికారికంగా అయితే, ‘మేమిద్దరం ఒక్కటే..’ అని సంకేతాలు ఇచ్చేశారట.. ఆ లెక్కన త్వరలోనే వెంకటరెడ్డి కూడా సోదరుడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే బీజేపీలోకి వెళ్ళే అవకాశం వుంది. ఆయనకు వేరే ఆప్షన్ లేదు మరి.