కాళేశ్వ‌రానికి పోతిరెడ్డిపాడు సెగ‌..కేసీఆర్ ఇప్పుడేమంటారో?

పొతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామ‌ర్ధ్య విస్త‌ర‌ణ పై తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యంత‌రం వ్యక్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీ విడుద‌ల చేసిన జీవో ను త‌క్ష‌ణం ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేసింది. పోతిరెడ్డిపాడు విస్త‌ర‌ణ పెరిగితే తెలంగాణ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే పేర్కొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ కు అంగీక‌రించ‌మ‌ని భీష్మించుకుని కూర్చున్నారు.  తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అవ‌స‌ర‌మైతే సుప్రీం కోర్టుకైనా వెళ్తామ‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు.

దీనిపై నిన్న ఏపీ ప్ర‌భుత్వం కృష్ణా బోర్డుకు వివ‌ర‌ణ ఇవ్వ‌డం జరిగింది. త‌మ‌కు రావాల్సిన వాటా నీళ్ల‌నే తీసుకుంటున్నామ‌ని, వ‌ర‌ద‌లు కార‌ణంగా పోయే నీటి కోస‌మే పోతిరెడ్డిపాడు సామార్ద్యం పెంచుతున్నామ‌ని బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ ప్ర‌కార‌మే ముందుకెళ్తున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. ఈ విష‌యంలో తాము కూడా ఎంత దూర‌మైనా వెళ్తామ‌ని హెచ్చ‌రించారు. రాల‌య‌సీమ స‌హా, ప్ర‌కాశం, నెల్లూరు తాగు నీరు లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని కృష్ణా బోర్డుకి, తెలంగాణ ప్ర‌భుత్వ‌నికి క్లియ‌ర్ గా అధికారులు వివ‌రించారు. అయితే ఇదే ఊపులో ఏప్రీ ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ఫిర్యాదు చేసింది.

తెలంగాణ నిర్మిస్తోన్న కాళేశ్వ‌రం, సీతారం ఎత్తిపోత‌ల ప్రాజెక్ట్ ల‌ను త‌క్ష‌ణం నిలిపివేయాల‌ని గోదావ‌రి బోర్డు చైర్మెన్ కు ఫిర్యాదు చేసారు. రెండు రాష్ర్టాల మ‌ధ్య ఎలాంటి ఒప్పందాలు లేకుండా, ట్రెబ్యున‌ల్ ద్వారా కేటాయింపులు లేకుండానే తెలంగాణ ఈ కొత్త ప్రాజెక్ట్ ల‌ను చేప‌డుతుంద‌ని ఫిర్యాదు చేసింది. దీని వ‌ల‌న దిగువ‌న ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాలకు భ‌గం క‌లుగుతోంది, విభ‌జ‌న చ‌ట్టానికి కూడా ఇది విరుద్ద‌మ‌ని పేర్కొంది. కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల సామ‌ర్ధ్యం 225 టీఎంసీల నుంచి 450 టీఎంసీల‌కు, సీతారామ ఎత్తిపోత‌ల సామర్ధ్యాన్ని 70 నుంచి 100 టీఎంసీల‌ వినియోగ సామ‌ర్ధ్యానికి పెంచుతున్న‌ట్లు తెలుస్తోంద‌ని బోర్డుకు వివ‌రించారు. గ‌తంలోనే ఈ అంశాల‌ను గోదావ‌రి బోర్డు, కేంద్ర ప్ర‌భుత్వం, జ‌ల‌సంఘం దృష్టికి తీసుకెళ్లామ‌ని, అపెక్స్ కౌన్సిల్ లో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కోరామ‌ని ఏపీ లేఖ‌లో పేర్కొంది. కానీ అప్పుడు ఎవ‌రూ కూడా దీనిపై చ‌ర్చంచ‌డానికి ముందుకు రాలేద‌ని తెలిపారు. తాజా స‌న్నివేశంతో కాళేశ్వ‌రంకు ఏపీ నుంచి పోటు మొద‌లైన‌ట్లే. మ‌రి దీనిపై కేసీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.