స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగుతో పాటు మరో ఇండస్ట్రీలో కూడా భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అదే కేరళ.. అక్కడ ఏం నచ్చిందో తెలియదు కానీ బన్నీకి మాత్రం భయంకరమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈయన సినిమాలు అక్కడ రికార్డులు తిరగరాస్తుంటాయి. వాళ్ల హీరోల సినిమాల కంటే కూడా భారీగానే వసూలు చేస్తుంటాయి. అంత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీని ఇప్పుడు తమ రాష్ట్రం కోసం వాడుకున్నారు కేరళ పోలీసులు. వీళ్లు చేసిన పని.. ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీకి ఉన్న క్రేజ్ ఓ మంచి పని కోసం వాడుకున్నారు అక్కడి పోలీసులు.
కేరళ పోలీసులు కొత్తగా ‘పోల్ యాప్’ మొదలు పెట్టారు. అది పోలీస్ యాప్.. ఎక్కడ ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా క్షణాల్లో అక్కడ వాలిపోయే యాప్ అది. ఈ యాప్ ను జనంలోకి తీసుకెళ్లడానికి అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలోని ఓ సీన్‌తో చిన్న వీడియో విడుదల చేసారు. దాంతో ప్రమోట్ చేసుకుంటున్నారు. రేసుగుర్రం చూసిన వాళ్లకు ఆ సన్నివేశం ఏంటో అర్థమైపోయుంటుంది. హీరో కుటుంబాన్ని విలన్స్ చుట్టుముట్టిన సమయంలో మెరుపులా పోలీస్ డ్రెస్ లో వచ్చేస్తాడు బన్నీ.
ఒక్కసారిగా విలన్‌లు హడలిపోయి సడన్ బ్రేక్ వేస్తారు. అలా తన కుటుంబాన్ని హీరో రక్షించుకుంటాడు. ఇప్పుడు ఇదే వీడియోను పోల్ యాప్ కోసం వాడుకుంటున్నారు. ఈ యాప్ పరిధిలోకి అన్నీ శాఖలను అందుబాటులోకి తీసుకొచ్చామని కేరళ పోలీసులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో ఈ యాప్‌ను వినియోగిస్తూ.. తాము క్షణాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుంటామని చెప్పడానికి కేరళ పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా అక్కడ అంత మంది హీరోలున్నా కూడా బన్నీ వీడియోను వాడుకోవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.