కీర్తి సురేష్ ప్ర‌తిభ‌ను గుర్తించిన ఫోర్బ్స్‌.. అరుదైన గుర్తింపు ద‌క్కినందుకు ఆనందంలో మ‌హాన‌టి

చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. మ‌హాన‌టి చిత్రంలో ఈ అమ్మ‌డి ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టింది. అచ్చం సావిత్రి మాదిరిగానే అభిన‌యం ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌.. నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకుంది. తాజాగా కీర్తికు మ‌రో అరుదైన గుర్తింపు ద‌క్కింది. దేశవ్యాప్తంగా 30 సంవత్సరాలకు లోపల ఉన్న యువతి యువకుల‌లో ఎవ‌రైతే తమ తమ రంగాల్లో అత్యంత ప్రతిభ చూపించారో వారిని షార్ట్ లిస్ట్ చేసింది ఫోర్బ్స్.

ప్రతిష్టాత్మక జాబితాలో చోటుదక్కించుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేసిన కీర్తి సురేష్ గ‌ర్వంగా ఉంద‌ని కామెంట్ పెట్టింది. దీనిపై నెటిజన్స్, ప‌లువురు సెల‌బ్స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన కీర్తి సురేష్ వాటితో ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. కీర్తి న‌టించిన మిస్ట‌ర్ ఇండియా, పెంగ్విన్ చిత్రాల‌ను ఓటీటీలో విడుద‌ల చేశారు. అవి తీవ్ర నిరాశ‌ప‌రిచాయి. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది కీర్తి సురేష్‌. ఇందులో ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రం కూడా ఉంది. గుడ్ లక్ సఖి అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోండ‌గా, ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మ‌రోవైపు కీర్తి సురేష్ తెలుగులో రంగ్ దే అనే సినిమా చేస్తుంది. నితిన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రఖ్యాత కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు పనిచేస్తున్నాడు. మ‌రోవైపు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, ఈ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్ళింది. మరోవైపు తమిళ రీమేక్ వేదాళంలో కూడా నటించనుంది. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.