వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. అన్నట్టు తయారైంది పరిస్థితి. లేకపోతే, బీజేపీ నేతలు మీడియా ముందుకొచ్చి.. పదే పదే ‘కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం..’ అని ఎందుకు చెబుతారు.? గ్రేటర్ ఎన్నికల సమయంలో ‘కేసీఆర్ తప్పించుకోలేరు.. ఆయన్ని జైలుకు పంపుతాం..’ అని నినదించేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్. కానీ, ఏమయ్యింది.? ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదు. అసలు, ఏ కేసు పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బీజేపీ జైలుకు పంపిస్తుందట.? మీడియా ముందుకొస్తే, ఇదొక పాచిపోయిన మాటలా తప్పనిసరిగా వాడాల్సిందేనని రూల్ ఏమైనా తెలంగాణ బీజేపీ పెట్టుకుందా.? అన్న అనుమానం కలగక మానదు.
తాజాగా ఎంపీ అరవింద్ ఇంకోసారి కేసీఆర్ మీద విరుచుకుపడిపోయారు. ‘కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదు.. జైలుకి పంపిస్తాం.. విదేశాలకు పారిపోయినా రప్పిస్తాం.. విజయ్ మాల్యాలా పారిపోతే మాత్రం చెప్పలేం..’ అంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఇదెక్కడి పంచాయితీ.? రాజకీయాలంటే ఏ పార్టీ.. ప్రజలకు ఏమేం చేస్తుందో చెప్పుకోవాలి. కేసీఆర్ జైలుకు వెళ్ళడం.. అనేదే తమ రాజకీయ లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంటే ఎలా.? పోనీ, ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా.? అంటే అదీ లేదాయె. దుబ్బాక ఉప ఎన్నిక అయిపాయె.. గ్రేటర్ ఎన్నికలు అయిపాయె.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతోందాయె.. తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా బీజేపీ సొల్లు కబుర్లు ఇలాగే నడుస్తాయన్నది గులాబీ నేతల ఉవాచ.