తెలంగాణ: రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అనే అంశంపై శనివారం నాడు చర్చించిన రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టటం, దేశవ్యాప్తంగానే కాకుండా, పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం బాగా తగ్గడంతో పాటు కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని దాంతో లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.
సామాన్యుల జీవితాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేబినెట్ పేర్కొంది. లాక్‌డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి కరోనా నిబంధనలను విధిగా పాటించాలని ప్రజలను కోరింది. అలానే అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖను ఆదేశించింది. అయితే, అంతర్రాష్ట్ర ప్రయాణాలు, బస్సు సర్వీసుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కరోనా నియంత్రణకు ప్రజల నుండి సంపూర్ణ సహకారం కోరుతూ రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది. ఇదివరకు విధించిన లాక్‌డౌన్ నేటితో ముగియనుండటంతో ఆదివారం నుంచి కొత్త ఆదేశాలు అమలవుతాయి.