తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌పై ముప్పేట దాడి

ఓ వైపు భారతీయ జనతా పార్టీ, ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ, మరో వైపు వైఎస్ షర్మిల పార్టీ.. కొత్తగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుణ్యమా అని బీఎస్పీ నుంచి.. ఇలా అన్ని వైపుల నుంచీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ ‘పోటు’ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే, చేతికి ఎముక లేదన్నట్టుగా సరికొత్త సంక్షేమ పథకాల్ని ప్రకటించడం ద్వారా ఆయా పార్టీల గొంతుకలు మూగబోయేలా చేయాలనుకుంటున్నారు కేసీయార్. కానీ, ధనిక రాష్ట్రం తెలంగాణ.. కేసీయార్ హయాంలో అప్పులపాలైపోతోంది. ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందకపోవడం కేసీయార్ మీద మరింత ఒత్తిడి పెంచుతోంది. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ధనిక రాష్ట్రం..’ అంటూ తాజాగా బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఎవరి డబ్బులు పంచుతున్నారు.? అది ప్రజల డబ్బు.. మీరేమన్నా మీ ఇళ్ళల్లోంచి తీసుకొచ్చి పంచుతున్నారా.?’ అంటూ నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం విదితమే.

తాజాగా, ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఓ బహిరంగ సభ సాక్షిగా కేసీయార్‌కి అల్టిమేటం జారీ చేశారు. త్వరలో కేసీయార్‌ని జైలుకు పంపుతామని రేవంత్ రెడ్డి శపథం చేసేశారు. కేసీయార్ జైలుకెళతారని బీజేపీ కూడా అంటోంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చే పరిస్థితి లేదు. కానీ, తరచూ ఉప ఎన్నికలు వస్తున్నాయి. ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక జోరు కనిపిస్తోంది. ఉప ఎన్నిక వచ్చిన ప్రతిసారీ, ఆయా నియోజకవర్గాలకు వందలు, వేల కోట్ల హామీలు ఇచ్చుకుంటూ పోతే ఎలా.? దళిత బంధు పేరుతో హుజూరాబాద్ నియోజకవర్గానికి 500 కోట్లు ప్రకటించింది కేసీయార్ ప్రభుత్వం. రాష్ట్రంలో 100కి పైగా వున్న నియోజకవర్గాల మాటేమిటి.? వాటికెంత ఖర్చవుతుంది.? ముప్పేట దాడిలో కేసీయార్ రాజకీయంగా ఏమవుతారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణ కాస్తా బీద రాష్ట్రంగా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఈ సంక్షేమ ఖర్చుల కారణంగా.