పాపం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇటీవల ఏ ఆలోచన చేసినా అది బెడిసికొట్టేస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి సహా చాలా పరిణామాలు కేసీయార్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కేంద్రం మీద గుస్సా అవుతూ, తెలంగాణ వ్యాప్తంగా రైతులతో కలిసి హంగామా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు కేసీయార్. తెలంగాణ రైతాంగం, కేసీయార్ సర్కారు తీరు పట్ల అస్సలేమాత్రం సంతృప్తిగా లేదని గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అర్థమవుతోంది.
అయినాగానీ, కేసీయార్ మాత్రం కేంద్రం మీదా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మీదా విరుచుకుపడుతూ, నిరసన కార్యక్రమాలు తెలంగాణలో వెలగబెట్టేశారు. అవి కాస్తా వర్కవుట్ కాకపోవడంతో, ఢిల్లీలో అమీ తుమీ తేల్చేసుకుంటామన్నారు. ఏకంగా, కేంద్రం మెడలు వంచేస్తామన్నారు.
ఏమయ్యింది కేసీయార్ ఢిల్లీ టూర్.? కేసీయార్ ఢిల్లీ టూర్ వెళ్ళినా.. అక్కడాయనకు ఎవరూ బ్రహ్మరథం పట్టేయలేదు. ఆయన్ని చూసి ఎవరూ వణికిపోలేదు. ‘కేసీయార్ ఉత్తచేతుల్తో తిరిగొచ్చారు..’ అంటూ కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
‘కేసీయార్ ఢిల్లీకి వెళ్ళిందెందుకు.? పబ్లిసిటీ స్టంట్ కాకపోతే, కేసీయార్ టూర్‌ని ఎవరూ పట్టించుకోకపోవడమేంటి.?’ అంటూ రాజకీయ ప్రత్యర్థులు గులాబీ పార్టీపై విమర్శలు చేస్తోంటే, గులాబీ నాయకులకు ఎలా స్పందించాలో అర్థం కావడంలేదు.
కాగా, తెలంగాణలో రైతాంగం ఎదుర్కొంటోన్న సమస్యలపై రైతు సంఘాల జాతీయ స్థాయి నాయకుడొకరు, తెలంగాణ ప్రభుత్వంపై మండిపడటం గమనార్హం. ఆ రైతు సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమానికి కేసీయార్ మద్దతిచ్చినా, తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సానుకూలత లేకపోవడం కొసమెరుపు.