కేసీయార్ ఢిల్లీ రాజకీయం.. వైఎస్ జగన్‌కి షాక్ తప్పదా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో ‘కీలక వ్యవహారాలు’ చక్కబెడుతున్నారు. పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయడంతోపాటుగా, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవడం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలతోపాటుగా, రాజకీయ అంశాలపైనా ఢిల్లీ స్థాయిలో ‘పెద్దలతో’ చర్చలు జరుపుతుండడం.. ఇవన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాదన నెగ్గినట్లుగా ఇటీవలి కృష్ణా రివర్ బోర్డు మేనేజిమెంట్ సమావేశం తర్వాత ప్రచారం జరిగింది. అది తమ ఓటమిగా తెలంగాణ భావిస్తోందన్న ఊహాగానాలూ వినిపించాయి. మరి, ఈ అంశాలపై ఢిల్లీ పెద్దల వద్ద కేసీయార్, తన ‘వాదన’ వినిపించి, ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ పై చేయి సాధించేలా చేయగలుగుతున్నారా.? ఏమో, మరి.. కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఎప్పుడెలా మారతాయో, ఎవరికి షాకిస్తాయో చెప్పలేం.

కేంద్రంలో చేరమని బీజేపీ పెద్దలు, కేసీయార్‌ని కోరుతున్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఏపీతో వివిధ వివాదాలకు సంబంధించి తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తే.. ఆ దిశగా సానుకూల ఆలోచన చేస్తామని కేసీయార్, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు హామీ ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోపక్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇద్దరూ బీజేపీకి ఇప్పుడు సన్నిహితులేననీ.. ఇద్దర్నీ స్నేహితుల్లానే బీజేపీ చూస్తోందన్న ప్రచారమూ లేకపోలేదు. రాష్ట్ర స్థాయిలో బీజేపీ, అక్కడ ఏపీలో వైసీపీతో, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్‌తో రాజకీయ పంచాయితీలు నడుపుతోందిగానీ.. ఢిల్లీ స్థాయిలో ఆ రాజకీయ వైరం ఏమీ ఈ మూడు పార్టీల మధ్యా లేదనే అనుకోవాలేమో. ఇంతకీ, కేసీయార్ ఢిల్లీ పర్యటనటో వైసీపీకి షాక్.. అన్న ప్రచారం చేస్తున్నదెవరబ్బా.? ఇంకెవరు టీడీపీనే.