కేసీఆర్ పెద్ద మనసు: ప్రైవేటు స్కూళ్ళ టీచర్లకు ఊరట.. విద్యార్థులకేదీ.?

KCR Bumper Offer To Private School Teachers

KCR Bumper Offer To Private School Teachers

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రైవేటు స్కూళ్ళ టీచర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడిన దరిమిలా, టీచర్లు ఉపాధి కోల్పోయిన మాట వాస్తవం. విద్యా సంస్థల యాజమాన్యాలు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్ని దోచేస్తూనే.. అటు టీచర్ల జీవితాలతో ఆడుకుంటున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, ప్రైవేటు స్కూళ్ళ టీచర్లకు నెలకు 2 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడాన్ని స్వాగతించాల్సిందే.

నెలకు 25 కేజీ బియ్యం ఇవ్వడాన్నీ అభినందించాలి. కానీ, విద్యార్థుల మాటేమిటి.? విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితేంటి.? ఆన్‌లైన్ విద్య పేరుతో విద్యా సంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయి. చెప్పే పాఠాలు తక్కువ.. దోచే ఫీజులు ఎక్కువ.. అన్నట్టు తయారైంది పరిస్థితి. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ, విద్యా సంస్థల యాజమాన్యాలు తెలివిగా.. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల్ని పక్కన పెట్టి, మొత్తం ఫీజుని 10 నెలలకు విడగొట్టి.. వసూళ్ళకు దిగుతోంది. ఫీజులు కట్టని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు లేవు. ప్రభుత్వ జీవోకి అనుగుణంగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థల యాజమాన్యాల్ని కోరితే, ‘దిక్కున్న చోట చెప్పుకోండి..’ అంటూ నిర్లక్ష్య పూరిత సమాధానమివ్వడమే కాదు, విద్యార్థుల తల్లిదండ్రుల్ని దుర్భాషలాడుతున్న వైనం కూడా కళ్ళ ముందే కనిపిస్తోంది.

విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఏమో, ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు కాస్త కరిగి.. విద్యార్థుల తల్లిదండ్రుల వెతల్ని కూడా ఆయన గుర్తెరిగితే.. ఫీజుల దోపిడీ నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందేమో వేచి చూడాలి.