నటుడు, సినీ విమర్శకుడు ‘కత్తి మహేష్’ కొద్ది సేపటి క్రితం మరణించారు. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, చంద్రశేఖరపురం సమీపంలో హైవే మీద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. రెండు వారాలుగా ఆయనకు చికిత్స చేస్తున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించి ఆయన మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై-కలకత్తా రహదారిపై వెళ్తున్న కత్తి మహేష్ ఇన్నోవా కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవటానికి కేవలం ఆయన సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటమే కారణం. కానీ ముందునే కూర్చుని ఉన్న మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
తొలుత డాక్టర్లు ఆయనకు ప్రాణాపాయం ఏమీ లేదని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. కానీ, ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మహేశ్ ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుకోవడంతో చనిపోయారని ఆయన సన్నిహితులు తెలిపారు. కోలుకుని బయటికి వస్తాడు అనుకుంటున్న తరుణంలో కత్తి మహేష్ ఇలా కన్నుమూయడం అందర్నీ షాక్ కి గురిచేస్తుంది. ఆయనే గనుక సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నట్లయితే ప్రాణం పోయేది కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
» దయచేసి అందరూ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేయండి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకండి.