చిరంజీవి సినిమా టైటిల్ తో కార్తికేయ కొత్త సినిమా..! పోస్టర్, టైటిల్ రిలీజ్

కార్తికేయ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కాసారిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. 2017లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టయింది. అప్పటినుంచీ కార్తికేయ హీరోగా వరుసగా సినిమాలు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వస్తున్నాయి. కార్తికేయ కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గానూ చేస్తున్నాడు. నాని.. గ్యాంగ్ లీడర్ లో, తమిళంలో అజిత్ హీరోగా వస్తున్న వాలిమై సినిమాలోనూ విలన్ గా నటించాడు. ఇలా తనదైన మార్గంలో వెళ్తున్న కార్తికేయ హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టైటిల్ ను ఈరోజు సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. అయితే.. ఈ టైటిల్ మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్ కావడం విశేషం.

కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరెకెక్కిందీ సినిమా. సినిమా టైటిల్ ను ‘రాజా విక్రమార్క’గా ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ డైరక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ టైటిల్ ను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. హీరోకి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.  టైటిల్ తోపాటు కార్తికేయ లుక్ రివీల్ చేశారు. టేబుల్ పై ల్యాప్ టాప్, చిప్స్.. తో రిలాక్స్ గా ఉన్న కార్తికేయ పోస్టర్, టైటిల్ నెట్టింట్లో హడావిడి చేస్తున్నాయి. పైగా.. చిరంజీవి సినిమా టైటిల్ కావడంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘మా బాస్ సినిమా టైటిల్ పెట్టుకున్నా. అభిమానానికి మించిన అర్హత ఏముంది’ అంటూ కార్తికేయ ట్వీట్ చేసి చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్నారు.

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై టి.ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని సినిమా ఆకట్టుకుంటుంది. సినిమాకు రాజా విక్రమార్క పర్ఫెక్ట్ టైటిల్. లాక్ డౌన్ ఆంక్షలు సడలిన తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేస్తాం’ అన్నారు. దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ..’ఎన్ఐఏలో కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్ గా కార్తికేయ నటిస్తున్నారు. ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. తమిళ అమ్మాయి తాన్యా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. రిలీజ్ వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అన్నారు.