Kannappa: కన్నప్ప సినిమా ఎఫెక్ట్.. యూనివర్సిటీలోకి కొత్త కోర్స్.!

Kannappa: టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. అయితే గత ఏడాది విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదల చాలా నెలలుగా వాయిదాలు పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఆరు నెలలు పూర్తి అయిన కూడా ఇప్పటివరకు విడుదల చేయకపోవడానికి కారణం వీఎఫ్ఎక్స్ వర్క్‌ పూర్తి కాకపోవడం అంటూ మంచు విష్ణు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో క్వాలిటీ రావడం లేదు అంటూ మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వీఎఫ్ఎక్స్ వర్క్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కన్నప్ప సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం తాను గతంలో ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ సినిమాను తీయడం ఎంత కష్టమో అర్థం అయింది. ఇండియాలో అందుకు తగ్గట్లుగా టెక్నీషియన్స్‌ లేకపోవడంతో వర్క్ చాలా ఆలస్యం అవుతోంది. విదేశాల్లో ఈ వర్క్‌ ను చేయించాల్సి వచ్చింది.

అందుకే సినిమా విడుదల విషయంలో జాప్యం అవుతుంది. పైగా ఒక అనుభవం లేని వ్యక్తికి వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ బాధ్యతలను అప్పగించడం వల్ల చాలా నష్టపోయాను అన్నాడు. హైదరాబాద్‌లో ఉన్న కంపెనీతో పాటు విదేశాల్లో ఉన్న మొత్తం 8 కంపెనీలకు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను అప్పగించాను. అన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ మ్యాన్‌ పవర్‌ తక్కువగా ఉండటం వల్ల సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నాము. నా ఒక్క సినిమా మాత్రమే కాకుండా చాలా సినిమాలకు ఇదే పరిస్థితి. అందుకే ఇండియాలో వీఎఫ్‌ఎక్స్ నిపుణులను రెడీ చేయాలనే ఉద్దేశంతో మా మోహన్‌ బాబు యూనివర్శిటీలో ఇందుకు సంబంధించిన కోర్స్ ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాము. మూడు సంవత్సరాలు ఉండే ఈ వీఎఫ్‌ఎక్స్ కోర్స్‌ కు సంబంధించిన డిగ్రీని మా యూనివర్శిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించాము. ఇండియాలో ఉన్న వీఎఫ్‌ఎక్స్ నిపుణుల అవసరంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌ లో ఉన్న అవసరంను బట్టి అత్యాధునిక టెక్నాలజీని విద్యార్థిని విద్యార్థులకు అందించబోతున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. ఈ సందర్భంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.