తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి మద్దతుగా నిలిస్తూ వస్తున్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎన్ని గడ్డు పరిస్థితులు ఎదురైనా టీడీపీని వదిలి పక్కకు పోదు. వైసీపీ కి రెడ్లు ఎలాగో టీడీపీకి కమ్మ వర్గం అలాగన్నమాట. నందమూరి తారక రామారావుతో మొదలైన వీరి బాండింగ్ చంద్రబాబు నాయుడు వరకూ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం కల్పిస్తూనే వచ్చారు. అలా చంద్రబాబు చేరదీసిన కమ్మ నేతల్లో కొడాలి నాని ఒకరు. కొడాలి నానికి ఎన్టీఆర్ అంటే ప్రాణం. ఆయన మీదున్న ఇష్టంతోనే టీడీపీలో చేరారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ కు నాని చాలా సన్నిహితుడు. అందుకే నందమూరి అభిమానుల అండ, కమ్మ ఓటర్ల మద్దతు నానికి పుష్కలంగా దక్కాయి.
2004, 2009 లో టీడీపీ తరపున గుడివాడ నుండి పోటీ చేసిన నాని రెండుసార్లు గెలిచారు. కానీ 2014 ఎన్నికలకు ముందు పార్టీలో నందమూరి కుటుంబానికి విలువ లేకుండా పోయిందని, దానికి కారణం చంద్రబాబు రాజకీయమేనని అంటూ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. వైఎస్ జగన్ సైతం నానికి మంచి విలువే ఇచ్చారు. 2014, 2019లో వైసీపీ తరపున పోటీ చేసిన నాని రెండుసార్లు గెలిచారు. వైఎస్ జగన్ అభిమానులు, వైసీపీకి మద్దతుగా ఉన్న కొద్దిపాటి కమ్మ వర్గం ఆయన్ను బాగా సపోర్ట్ చేశారు. వైఎస్ జగన్ సైతం కమ్మ వర్గాన్ని టీడీపీ నుండి తనవైపుకు తిప్పుకోవడం కోసం అధికారంలోకి రాగానే కొడాలి నానికి మంత్రి పదవి కట్టబెట్టారు.
కానీ పూర్తస్థాయిలో కమ్మ సామాజిక వర్గం జగన్ వేసిన ఈ ఎత్తుగడకు పడలేదు. కొడాలి నాని టీడీపీని వదిలినంత ఈజీగా కమ్మ వర్గం వీడలేకపోతోంది. పార్టీ మీద, చంద్రబాబు మీద అభిమానంతో నానిని సైతం శత్రువుగా చూస్తున్నారు. మన పార్టీ ఆయనకు అవసరం లేనప్పుడు ఆయన మనకు అవసరమా అనుకుంటున్నారు. పైగా కమ్మ వర్గం నుండి నాని ఒక్కరే నాయకుడు కాదు. టీడీపీలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అందుకే నాని తమ వర్గం వ్యక్తే అయినా, ఎన్టీఆర్ వీరాభిమాని అయినా, తారక్ కు సోదర సమానుడైనా పార్టీయే ముందు ఆ తర్వాతే ఎవరైనా అనుకుని ఆయన్ను పక్కనబెట్టేశారు. ఏరోజైతే నాని టీడీపీని వీడారో ఆరోజే ఆ పార్టీ కమ్మ వర్గం నానిని వద్దనుకుంది. అంటే ఒక్క రాత్రిలో సీన్ మొత్తం మారిపోయిందన్నమాట.