అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలా హారిస్ మంగళవారం కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి మోతాదును తీసుకున్నారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని యునైటెడ్ మెడికల్ సెంటర్ లో మోడెర్నా వ్యాక్సిన్ ను వైద్య నిపుణులు ఇవ్వగా , అమెరికా మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకా వేసుకునేలా ప్రతి ఒక్కరికి ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఎలాంటి నొప్పి ఉండదని, సురక్షితమైందని చెప్పారు. టీకా ప్రాణాలను కాపాడడానికి సంబంధించిందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలను తాను విశ్వస్తున్నానన్నారు.
టీకాను తయారు చేసి, ఆమోదించింది వారేనన్నారు. తాను టీకా రెండో డోసు తీసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. అలాగే ఆమె భర్త డౌగ్ ఎమ్హాఫ్ కూడా టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ ఫైజర్ మోడెర్నా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడ్, అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రెటరీ అలెక్స్ అజార్ సైతం వ్యాక్సిన్‌ను తీసుకొని ప్రజలకు వ్యాక్సిన్‌పై అమెరికా ప్రజలకు భరోసా ఇచ్చారు.