కేఏ పాల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేమీ లేదు. తాను నిల్చోమంటే ట్రంప్ నిల్చుంటాడనీ.. కూర్చోమంటే కిమ్ (కొరియా కసాయి) కూర్చుంటాడనీ పాల్ చెప్పగలడు. కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ తెలుగు నేలపై రాజకీయాల్లో సూపర్బ్ కమెడియన్.
చిత్రమేంటంటే, టీడీపీ అనుకూల మీడియా అలాగే వైసీపీ అనుకూల మీడియా కూడా కేఏ పాల్ వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకుంటాయ్.
చంద్రబాబుని విమర్శించడానికో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికో, లేదంటే కేసీయార్ అలాగే నరేంద్ర మోడీని విమర్శించడానికో.. కేఏ పాల్ అనే ‘మాధ్యమం’ అందరికీ అవసరమే.
చిన్న ‘కీ’ ఇచ్చి వదిలేస్తే చాలు, పాల్ చెలరేగిపోతాడంతే. పాల్ వచ్చాడు కాబట్టి, రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేసినట్లేనన్న విశ్లేషణ జరుగుతోంది.
ఇందులో కొంత నిజం లేకపోలేదు. వైసీపీ జీరో, టీఆర్ఎస్ జీరో, టీడీపీ జీరో, జనసేన జీరో, బీజేపీ జీరో.. ఓన్లీ ప్రజాశాంతి పార్టీ హండ్రెడ్ పర్సంట్.. ఇదీ పాల్ చేసే కామెడీ.
ఈ కామెడీకి బోల్డంత ఫాలోయింగ్ వుంది. అందుకే, చేసేవి వెకిలి చేష్టలయినాగానీ, కేఏ పాల్ అంటే మీడియాకి అంత స్పెషల్ అటెన్షన్. పవన్ కళ్యాణ్ సంబంధిత వార్తలైనా, వైఎస్ జగన్ అలాగే చంద్రబాబు సంబంధిత వార్తలైనా, కేసీయార్ అలాగే నరేంద్ర మోడీలకు సంబంధించిన వార్తలైనా కేఏ పాల్ కామెడీ తర్వాతనే.. అన్నట్టు మీడియా అతి చేయడం కొత్తేమీ కాదు.
ఇంతలా తన మీడియా వెంట పడుతున్నప్పుడు, కేఏ పాల్ కామెడీని నమ్ముకోక.. సీరియస్‌గా, వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తాడా ఏంటి.?