HHVM: డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా జులై 24వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే తాజాగా హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. ఈ టైటిల్ పెట్టింది దర్శకుడు క్రిష్ గారు. ఆయనకు ధన్యవాదాలు. ఇందులో బాబీ దేవోల్ ఔరంగజేబుగా కనిపిస్తారు. అఖండ భారతావనికి మొఘల్ చక్రవర్తి అయిన ఛత్రపతి శివాజీ ఉన్నంత కాలం ఔరంగజేబుకు నిద్రపట్టలేదు. శివాజీ 1680లో చనిపోయారు. హరి హర వీరమల్లు కథ 1684లో మొదలవుతుంది. మొఘలుల నుంచి జ్యోతిర్లింగాలు, కాశీ క్షేత్రం కాపాడటంతో పాటు, ధర్మస్థాపన కోసం ఒక యోధుడు చేసే పోరాటమే ఈ చిత్రం. అయితే ప్రతి శతాబ్దానికి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు.
ఈ 21 శతాబ్దానికి పవన్ కల్యాణ్ ఉండటం మన అదృష్టం. ఇలాంటి సమయంలో సనాతన ధర్మం కోసం పోరాటం చేసేవాళ్లు మనలో ఉండటం ఎంతో సంతోషం. ఇందులో ఒక ఫైట్ చూస్తే సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం చేసే పోరాటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫైట్ చూసి త్రివిక్రమ్ మెచ్చుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇస్తారు. మా తండ్రి మంచి పేరు సంపాదించి ఇచ్చారు. ఆయన వల్లే పవన్ కల్యాణ్ గారి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. సినిమా పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ సర్ నుంచి రెండు రోజుల పాటు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి నీ గురించి, సినిమా తీసిన విధానం గురించి కల్యాణ్ గారు రెండు గంటల పాటు మాట్లాడారు అని అన్నారు. అంతకన్నా గొప్ప అభినందన ఇంకేం ఉంటుంది అని జ్యోతికృష్ణ తెలిపారు. ఈ సందర్బంగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
HHVM: 21వ శతాబ్దపు ఛత్రపతి శివాజీ మన పవన్ కల్యాణ్.. డైరెక్టర్ జ్యోతికృష్ణ కామెంట్స్ వైరల్!
