ఏపీ, తెలంగాణలో బీజేపీ కోసం ఎన్టీయార్ ప్రచారం చేస్తాడా.?

ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ సేవల్ని ఉపయోగించుకుంటామంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ పర్యటన సందర్భంగా సినీ నటుడు జూనియర్ నందమూరి తారకరామారావుతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుత విజయంపై ఎన్టీయార్‌ని అభినందించేందుకే.. అని అప్పట్లో బీజేపీ చెప్పుకుంది.

కానీ, అది ‘సినిమా అభినందన’ సమావేశం కాదనీ, డిన్నర్ మీటింగ్ పేరుతో రాజకీయం చేశారనీ.. రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అందులో నిజం లేకపోలేదు కూడా. రాజకీయ నాయకులు ఏం చేసినా, అందులో రాజకీయం వుంటుంది. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసమే జూనియర్ ఎన్టీయార్‌ని అమిత్ షా కలిశారు. దానికి జూనియర్ ఎన్టీయార్ ఒప్పుకున్నాడా.? లేదా.? అన్నదైతే సస్పెన్స్.

కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల తెలంగాణలో పర్యటించినప్పుడు మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, సినీ నటుడు నితిన్ ఆయనతో భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారని, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

సో, వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీయార్ సంగతెలా వున్నా, నితిన్ అయితే బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశాలున్నాయన్న స్పష్టత వచ్చేసింది. తాజాగా సోము వీర్రాజు ప్రకటనతో జూనియర్ ఎన్టీయార్ కూడా బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని అర్థమవుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాన్ రూపంలో బీజేపీకి స్టార్ గ్లామర్ వున్నా, అంది వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకునేలా లేదు బీజేపీ. అందుకే, వీలైనంత ఎక్కువ సినీ గ్లామర్ కోసం బీజేపీ ఆరాటపడుతోంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా మరింత మంది సినీ ప్రముఖుల్ని బీజేపీ తమ వైపుకు తిప్పుకోనుంది.