జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో 2019 ఎన్నికలకు కొద్ది రోజులకు ముందు చేతులు కలిపారు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ. విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయన గెలుపుపై చాలా అంచనాలే క్రియేట్ అయ్యాయి. అయితే, అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో లక్ష్మినారాయణ చెప్పిన మాటలు, జనసేన అధినేతతో ఆయనకు నెలకొన్న సన్నిహిత బంధం.. ఇవన్నీ అప్పట్లో రాష్ట్ర వ్యాప్త చర్చనీయాంశమయిన మాట వాస్తవం. అయితే, పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళ్ళడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మినారాయణ, జనసేనకు గుడ్ బై చెప్పేశారు. అప్పట్లో ఈ అంశంపై తీవ్ర దుమారం చెలరేగింది.
లక్ష్మినారాయణ చాలా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, జనసైనికులు సంయమనం పాటించారు. జనసేన నేతలెవరూ లక్ష్మినారాయణపై ఘాటు విమర్శలు చేయలేదు. మళ్ళ ఇప్పుడు.. ఇన్నాళ్ళకు లక్ష్మినారాయణ తిరిగి జనసేన వైపు అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ‘జనసేనాని ఆహ్వానిస్తే..’ జనసేనలో తిరిగి చేరడానికి లక్ష్మినారాయణ సిద్ధంగా వున్నారట. లక్ష్మినారాయణ నేరుగా ఈ విషయాన్ని వెల్లడించలేరు. ఎందుకంటే, ఐపీఎస్ అధికారిగా ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతులు అలాంటివి. అయితే, ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక, అంతకు ముందు పేరు ప్రఖ్యాతులు పెద్దగా ఉపయోగపడవన్నది వేరే చర్చ. లక్ష్మినారాయణ తిరిగి జనసేనలోకి రావాలనుకుంటే పవన్ కళ్యాణ్ అడ్డు చెప్పే అవకాశం వుండకపోవచ్చు. కానీ, పార్టీ బాగు కోసం.. పార్టీకి ఆర్థిక అండదండలందించేందుకోసం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారన్న విషయాన్ని లక్ష్మినారాయణ అర్థం చేసుకోలేకపోయారన్న ఆవేదన మాత్రం జనసైనికుల్లో వుంది. ఆ ఆవేదన పక్కన పెట్టి మరీ ‘మీరు జనసేనతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం..’ అని జనసైనికులు, జేడీ అభిమానులు ఆయన్ని కోరుతున్నారు.