జనసేనాని రధం సిద్ధం.! సైన్యమూ సిద్ధమే.! కానీ, ఇదేం రాజకీయం.?

మొన్నీమధ్యనే ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించిన జనసేనాని, ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. రెండు మూడు వారాలకు పైనే ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయాలు వేరు, సినిమా రంగం వేరు. లైట్స్ ఆన్.. కెమెరా.. అనగానే నటించి వెళ్ళిపోవచ్చు సినిమాల్లో. అలాగని, సినిమాల్లో నటన అంట అంత తేలిక కాదు. సినిమాలతో పోల్చితే, రాజకీయం చాలా చాలా కష్టం.

రాజకీయాల్లో అభిమానంతో పూలు చల్లినా, ఆ పూలు కూడా ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ఇదీ అనుభవమే. అభిమానులు మీదకు దూకడంతో, పలుసార్లు వాహనాల మీద, స్టేజీ మీదా పడిపోవాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్. ఇదంతా రాజకీయాల్లోనే జరిగింది.

ఈ నేపథ్యంలో జనసేనాని ప్రయాణించబోయే రాజకీయ రధాన్ని చాలా గట్టిగా తయారు చేయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని మెరుపు పర్యటనల కోసం దీన్ని వినియోగిస్తారట. విజయదశమి నుంచి జనసేనాని జనంలో వుండబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

అంతా బాగానే వుందిగానీ, ఇప్పటిదాకా చేసినట్లే పవన్ కళ్యాణ్ టైమ్ పాస్ రాజకీయాలు చేస్తే, వచ్చే ఎన్నికల్లో పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది. పార్టీని అంటిపెట్టుకుని వుండేందుకు నేతలెవరూ ఇష్టపడటంలేదు. ఏ నాయకుడైనా, రాజకీయంగా తమకు హోదా, గుర్తింపు కావాలని కోరుకుంటారు. అవి రావని తెలిస్తే, ఏ పార్టీలో అయినా ఎందుకుంటారు.?

పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలున్నాయ్.. వాటిని మేనేజ్ చేసుకుంటూ, జనంలోకి వెళ్ళడం అంత తేలిక కాదు. వెళ్ళినా, ఏదన్నా చిన్న అనారోగ్యం సంభవిస్తే.. మొత్తం ప్లాన్ మటాష్ అయిపోతుంది. అన్నిటికీ మించి, వచ్చే ఎన్నికల్లో జనాన్ని ఏం చెప్పి తమ వైపుకు తిప్పుకోవాలో అర్థం కాని స్థితిలో జనసేన పార్టీ వుంది. ఇదా రాజకీయమంటే.?