జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖపట్నం వెళుతున్నారు. విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేస్తోన్న ఆందోళనకు మద్దతివ్వనున్నారు. దాంతో, తెలుగు రాష్ట్రాల్లోని జనసైనికుల్లో కొత్త ఉత్సాహం షురూ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచే కాక, తెలంగాణ నుంచీ జనసైనికులు విశాఖకు పయనమవుతున్నారు.
అంతా బాగానే వుందిగానీ, పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఈ పొలిటికల్ ఈవెంట్ ఎంతవరకు సమంజసం.? అన్నదే అసలు చర్చ. స్టీలు ప్లాంటుని ప్రైవేటీకరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ. ఆ బీజేపీకి జనసేన మిత్రపక్షం. ఇక్కడ మేటర్ క్లియర్, విశాఖ వెళ్ళి జనసేనాని హంగామా చేయడం కంటే, ఢిల్లీకి వెళ్ళి మిత్రపక్షాన్ని నిలదీయాలి.
కానీ, అంత సీన్ పవన్ కళ్యాణ్‌కి లేదు. బీజేపీని నిలదీస్తే ఏమవుతుందో పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు. బీజేపీని ప్రశ్నించలేనప్పుడు, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎంత హంగామా చేసినా ఏం లాభం.?
నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ స్టీలు ప్లాంటు విషయమై ఏ రాజకీయ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు. వైసీపీ అయినా, టీడీపీ అయినా.. విశాఖ స్టీలు ప్లాంటుకి సంబంధించి చిత్తశుద్ధితో బీజేపీ మీద పోరాటం చేయలేకపోతున్నాయి. రాష్ట్రానికి ఇదే అతి పెద్ద సమస్య.
రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్, విశాఖకు వెళ్ళి ఎవర్ని విమర్శిస్తారు.? ఎవర్ని తప్పు పడతారు.? బీజేపీ మిత్రపక్షంగా వుండి, కేంద్రాన్ని జనసేనాని విమర్శిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. షరామామూలుగానే వైసీపీ అసమర్థత.. అంటూ పవన్ విమర్శలు చేస్తే.. ఏమో, చేసినా చేస్తారు.. ఆయనంతే అదో టైపు.