జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు వస్తాయ్.? ఈ ప్రశ్న చుట్టూ రకరకాల చర్చోపచర్చలు జరుగుతున్నాయి గత కొంతకాలంగా. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజానికి, జనసేన పార్టీ అప్పటికి పూర్తి స్థాయిలో సర్వసన్నద్ధం కాలేకపోయింది. అందుక్కారణాలనేకం.
నిజానికి, జనసేన 2019 ఎన్నికల్లో ఇంకా బాగా ఫేర్ చేసి వుండాలి. కానీ, జనసేనాని స్వయంకృతాపరాధం వల్ల ఆ పార్టీ తన ఉనికిని చాటుకోలేకపోయింది. అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. మరి, 2024 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా వుండబోతోంది.?
2014 ఎన్నికలకీ, 2019 ఎన్నికలకీ 2024 ఎన్నికలకీ చాలా తేడా వుంది జనసేన విషయానికొస్తే, 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదుగానీ, టీడీపీ – బీజేపీ కూటమికి మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో లేని బహుజన్ సమాజ్ పార్టీతోపాటు, రాష్ట్రంలో గల్లంతైన వామపక్షాలతో కలిసి పోటీ చేసింది జనసేన.
వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా ఆ పార్టీకి 12 నుంచి 15 శాతం ఓట్లు వస్తాయన్నది పలు సర్వేలు చెబుతున్న విషయం. ఇదే విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కుండబద్దలుగొట్టేశారు. జనసేన ఓటు బ్యాంకు పెరిగిందనీ, అది 12 నుంచి పదిహేను శాతం వరకూ వుండొచ్చని అభిప్రాయపడ్డారాయన.
అయితే, టీడీపీ – జనసేన కలిస్తే, జనసేన పార్టీకి అది మరింత అడ్వాంటేజ్ అవుతుందని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషిస్తున్నారు. కానీ, అలా ఆ రెండు పార్టీలు కలుస్తాయా.? కలవవా.? అన్నది నరేంద్ర మోడీ చేతుల్లో వుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు టీడీపీ – జనసేన పొత్తు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే, జనసేన ఓటు బ్యాంకు 20 శాతం దాటినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.!