మార్పు కోసం.. అంటూ రాజకీయాల్లోకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించినా, అధికారంలోకి రాలేకపోయారు, ఎక్కువకాలం ఆ పార్టీని నడపలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రజారాజ్యం పార్టీని కలిపేసి, కేంద్ర మంత్రి అయ్యారు.. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన యూత్ వింగ్ యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన పవన్ కళ్యాణ్, తన అన్నయ్య రాజకీయ ప్రస్థానానికి ఓ మోస్తరు బిగినింగ్ అయితే ఇవ్వగలిగారుగానీ, ఎక్కువకాలం ఆయన కూడా ఆ పార్టీలో వుండలేకపోయారు. ఇక, 2014 ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్, ఏడేళ్ళపాటు రాజకీయాల్లో వున్నారు.. జనసేన పార్టీకి ఏడేళ్ళు పూర్తవుతోంది.. ఇన్నేళ్ళలో జనసేన పార్టీ ఏం సాధించింది.? అంటే, ఒకే ఒక్క ఎమ్మెల్యేని 2019 ఎన్నికల్లో గెలిపించుకుని, ఏడాది తిరగకుండానే ఆ ఎమ్మెల్యేని దూరం చేసుకుంది. ఈ ఏడేళ్ళ ప్రస్తానంలో జనసేన అధినేత మార్చిన జెండా రంగులు అన్నీ ఇన్నీ కావు. కాషాయ జెండా, టీడీపీ జెండా.. 2014 ఎన్నికలనాటి వ్యవహారం.
ఆ తర్వాత వామపక్షాల్ని వెంటేసుకుని, ఎర్ర జెండా పట్టుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో బీఎస్పీ జెండా చేతపట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే మళ్ళీ పాత గూటికి.. అదే బీజేపీ పంచన చేరింది జనసేన పార్టీ. జనసేన పార్టీ ఏడేళ్ళు పూర్తి చేసుకుందంటూ జనసైనికులు.. అదేనండీ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఓ పక్క పండగ చేసుకుంటూనే, ఇంకోపక్క తిరుపతి ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నందుకు చాలా బాధపడిపోతున్నారు. ‘మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి గెలిచారు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మనకంటే గత ఎన్నికల్లో తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఆ సీటు వదిలేయడం బాధాకరం..’ అని అభిమానులు వాపోతున్నారు. ఏడేళ్ళ సంబరాల సందర్భంగా కూడా జనసైనికులకు ఉత్సహం లేకుండా పోయింది ఈ నిర్ణయంతో. ఇక, 2024 వరకు జనసేన పార్టీ, బీజేపీతో కలిసి పనిచేస్తుందా.? ఈ మధ్యలో ఇంకేమన్నా రంగులు, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు అంటుకుంటాయా.? వేచి చూడాల్సిందే.