పవన్ అలా.. నాదెండ్ల ఇలా.. జనసేనకు వేరే శత్రువు అక్కర్లా.!

కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న నియోజకవర్గమిది. సిటింగ్ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్ను మూయడంతో ఉప ఎన్నిక తలెత్తింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తుండడంతో, పోటీ ఉండకూడదనే భావనతో తాము బరిలోకి దిగడం లేదనీ, ఏకగ్రీవం ద్వారా వైసీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని వైసీపీకి సూచించారు పవన్ కళ్యాణ్. అయితే, జనసేన మిత్ర పక్షం బీజేపీ మాత్రం పోటీకి దిగింది. ప్రచారం కోసం పవన్ కళ్యాణ్‌ని పిలుస్తామని బీజేపీ అంటోంది.

ఇలాంటి సందర్భంలో తాము ప్రచారానికి వెళ్లబోమనీ, బీజేపీకి సహకరించబోమనీ చెప్పాల్సిన జనసేన, చిత్రంగా బీజేపీకి మద్దతు తెలిపింది. బీజేపీ తరపున ప్రచారం చేస్తామనీ, బీజేపీ గెలుపు కోసం పని చేస్తామనీ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించడం గమనార్హం.

జనసేన పార్టీకి వేరే శత్రువు అవసరం లేదు. కీలక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోవడం మరో వైఫల్యం. వెరసి జనసేన పార్టీని నిండా ముంచేస్తోంది. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేసి ఉంటే, కనీసం జన సైనికుల్లో కొంత ఉత్సాహమైనా కనిపించేది.

ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీని జనసేన తన భుజాలపైన మోయడం దండగ. ఆ విషయం జనసేన కార్యకర్తలకు అర్ధమవుతోంది. కానీ, జనసేన నాయకులకు అర్ధం కావడం లేదు. ఇదే తీరు 2024 ఎన్నికల్లోనూ కొనసాగిస్తే, జనసేన పార్టీ పూర్తిగా తాళం వేసేసుకోవచ్చు.

ఎందుకంటే, జనసేన పార్టీకి ఓ విధానమంటూ లేకుండా పోయింది. బీజేపీని మోయడానికి తప్ప జనసైనికులు దేనికీ పనికి రారన్న భావన జనసేన నాయకత్వం నుంచి వ్యక్తమవుతున్నట్లే, ఆ పార్టీ తీరు కనిపిస్తోంది. జనసేనకు ఓటేద్దామనుకునేవారు కూడా జనసేన నిర్ణయాల వల్ల, జనసేనకీ ఓటేయలేక, బీజేపీకీ ఓటేయలేక, వేరే ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తోంది.