జనసేన పార్టీని పవన్ అభిమానులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంటారు. పార్టీ మనదని భావించి సొంత ఖర్చులతో పార్టీ కార్యలాపాలు నిర్వహించే అభిమానులు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో చాలా చోట్ల ప్రచార ఖర్చులను కొన్ని నియోజకవర్గాల్లో అభిమానులే పెట్టుకున్నారు. ఇంతా చేసి పార్టీ ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈ ఫలితం ఘోర పరాజయమే. మొదట్లో ఫలితం చూసి బాధపడిన జనసైనికులు మెల్లగా తేరుకుని వాస్తవాలను గ్రహించి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అన్ని విధాలా బలపరచాలని తీర్మానించుకున్నారు. వాటిలో పార్టీని ఆర్థికంగా బలపర్చాలనే లక్ష్యం కూడా ఉంది.
పార్టీని నడపడానికి కావాల్సిన నిధుల కోసం పవన్ మళ్లీ కెమెరా ముందుకు వెళ్లారు. గతంలో మళ్లీ సినిమాలు చేయనని చెప్పిన ఆయన డబ్బు కోసం ఆ మాటను తప్పక తప్పలేదు. ఇదంతా జనసైనికులను తీవ్రంగా కలిచివేసింది. అందుకే చాలామంది స్వచ్చంధంగా పార్టీకి నెల నెలా తోచినంత విరాళాలు ఇస్తుంటారు. కానీ ఒక అభిమాని అత్యుత్సాహంతో పెద్ద ఘనకార్యమే చేశాడు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు. ఆలోపు అభిమానులు ఒక్కొక్కరు రూ.100 పార్టీకి డోనేట్ చేసి సుమారు రూ.200 కోట్ల పార్టీ విరాళాన్ని కూడబెట్టాలనే ఆలోచన చేశాడు. అనుకున్నదే తడవుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని జనసేన బ్యాంక్ ఖాతా నెంబరుతో సహా పోస్ట్ చేశాడు.
తక్కువ సమయంలోనే ఈ సందేశం వైరల్ అయింది. ఆలోచన బాగానే ఉందని కొందరు అంటే ఇలా పుట్టినరోజుకు విరాళాల సేకరణ నాయకుడు పవన్ కు నచ్చదని కొందరు వాదించారు. తిరిగి తిరిగి ఈ వార్త కాస్త పార్టీ అధికారిక వర్గాలకి చేరింది. వారు ఇలాంటి విరాళాల సేకరణ కార్యక్రమానికి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోరని, గతంలో కొందరు ఇలానే జనసేన పేరు మీద సొంత అకౌంట్ నెంబర్లు ఇచ్చి నిజమైన అభిమానుల నుండి విరాళాలు సేకరించారని, అది అధ్యక్షుడిని బాధించిందని అంటూ సదరు అభిమాని ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మాత్రం జనసేన అధికారిక ఖాతా నెంబర్ అని ధ్రువీకరించారు.