ఈరోజు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు అనేక సేవా కార్యక్రమాలకు పూనుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సీజన్ సిలీండర్లు అందించిన శ్రేణులు ఇంకొన్ని చోట్ల అనేక సేవా కార్యక్రమాలను ప్లాన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో అమలాపురం రూరల్ ఈదరపల్లి – ఇండుపల్లి రోడ్డు నిర్మాణం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. చాలా రోజుల క్రితమే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి కొన్నాళ్ళుగా బాగా పాడైపోయి అద్వాన స్థితిలో ఉంది. వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. దీంతో స్థానిక జనసేన శ్రేణులు రంగంలోకి దిగాయి.
తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినమైన సెప్టెంబర్ 2 అనగా ఈరోజు రహదారి నిర్మాణం ప్రారంభించాలని అనుకున్నారు. కొన్నిరోజుల పాటు శ్రమించి నిర్మాణానికి అవసరమైన 13 లక్షల రూపాయలను సేకరించుకున్నారు. అమలాపురం జనసేన అసెంబ్లీ ఇన్ ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు ఆధ్వర్యంలో 2 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి అన్నీ సిద్దం చేసుకున్నారు. ఈరోజు నిర్మాణ పనులు ఆరంభించడానికి పూనుకున్నారు. కానీ ఇంతలో పోలీసులు ప్రవేశించారు. రోడ్డు నిర్మాణ పనుల ఆరంభాన్ని నిలువరించారు. ఎందుకు రహదారి వేయకూడదో కారణం చెప్పకుండానే పనులు నిలిపివేయమన్నారు.
దీంతో పోలీసులకు జనసేన శ్రేణులకు మద్యన వాగ్వాదం చోటుచేసుకుంది. రోడ్డు బాగోలేదని, ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే తాము వేస్తున్నామని చెప్పినా పోలీసులు ఆగలేదు. దీంతో ఆ ప్రాంతం జనసేన నినాదాలతో హోరెత్తింది. రోడ్డు మీద బైఠాయించి జనసైనికులు, ఆ పార్టీ నేతలు ప్రభుత్వం వేయదు, సొంత ఖర్చులతో మేము వేస్తమంటే వేయనీయదు. అయినా రోడ్డు సొంతగా వేసుకుంటే తప్పేమిటి అంటూ ప్రశ్నించారు. ఈ ఉద్రిక్తతలో జనసేన నాయకులు, కార్యకర్తలు కలిపి సుమారు 100 మందిని పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషనుకు తరలించారు.