జనసైనికులకు మింగుడుపడని చిరంజీవి రాజకీయం.!

Mega Rajakeeyam : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమైపోయినా, ఆయన రాజకీయాలు చేస్తూనే వున్నారా.? తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా ఆయన ఎందుకు వ్యవహరిస్తున్నారు.? ఇలా చాలా ప్రశ్నలు ప్రతిసారీ వినిపిస్తున్నాయి.

‘నేను కావొచ్చు, పవన్ కళ్యాణ్ కావొచ్చు.. మా ఇద్దరి లక్ష్యం ఒకటే.. ప్రజలకు సేవ చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ, నేను రాజకీయాల్లో ఇమడలేకపోయాను. కానీ, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం వుంది.. రాజకీయాల్లో రాణిస్తాడు..’ అని పవన్ మీద చిరంజీవి చాలా నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటారు.

కానీ, పవన్ రాజకీయ ఎదుగుదలకు చిరంజీవి అడ్డుతగులుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. అందుకు ఆయన వ్యవహార శైలి కూడా ఓ కారణం. జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కట్టుబడి వుంటే, చిరంజీవి మాత్రం వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలికారు.

ఇలా చాలా విషయాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అభిప్రాయ బేధాలనండీ.. ఆలోచనల పరంగా విభేదాలనండీ.. మొత్తంగా మెగా అభిమానుల్లో (చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో) గందరగోళానికి కారణమవుతోంది.

ఇదిలా వుంటే, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే.. మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ‘మెగా ఆశీస్సులు’ పొందడం జనసేన వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్‌ని పొగుడుతూ, పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం ద్వారా మెగా అభిమానుల్లో చిచ్చు పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోందన్నది జనసైనికుల వాదనగా కనిపిస్తోంది.