జనసేన అధినేత పవన్ కళ్యాన్ చాలాకాలం తర్వాత తిరిగి జనంలోకి రాబోతున్నారు. హైద్రాబాద్‌లోని ఫామ్ హౌస్‌కే పవన్ పరిమితమయ్యారు గత కొద్ది నెలలుగా. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల తర్వాత పవన్, కరోనా బారిన పడటం, ఆ తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం.. వెరసి, పవన్.. తిరిగి జనంలోకి రావడానికి చాలా సమయమే పట్టింది. ‘మా నాయకుడు ఎక్కడా.?’ అని నినదించి నినదించి అలసిపోయారు జనసైనికులు.
జనసేనాని రంగంలోకి దిగకపోతేనేం, ఆయన చూపిన బాటలో సేవా కార్యక్రమల్లో పనిచేస్తామంటూ, కరోనా వేళ ప్రాణాలకు తెగించి మరీ జనంలోనే వున్నారు జనసైనికులు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ జనసైనికులు నిస్వార్ధంగా పనిచేశారు. కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు కష్టపడ్డారు.
ఈ క్రమంలో కొందరు జనసైనికులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు కూడా. తెలుగు నాట రాజకీయాల్లో నిస్వార్ధంగా కరోనా వేళ పనిచేసింది జనసైనికులేనన్న వాదనతో ఎవరైనా ఏకీభవించాల్సిందేనేమో. సరే, ఆ సంగతి పక్కన పెడితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు వెళుతున్నారు.
పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై, రాష్ట్ర రాజకీయాలు అలాగే, తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి వివాదం, జాబ్ క్యాలెండర్ వంటి అంశాల గురించి చర్చిస్తారట. అంతా బాగానే వుందిగానీ, పవన్ కళ్యాణ్ త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? ప్రస్తుతం పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే వున్న దరిమిలా, పవన్ విజయవాడ టూర్.. జస్ట్ ఓ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని అనుకోవచ్చా.? లాంటి ప్రశ్నలైతే రాజకీయ ప్రత్యర్థుల నుంచి దూసుకొస్తున్నాయి జనసేన మీద.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో జనసేన బలపడేందుకు సరైన సమయమిది. కానీ, బీజేపీతో స్నేహం కారణంగా జనసేన స్వంతంగా కీలక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. మరి, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా జనసేనాని ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.? వేచి చూడాల్సిందే.