జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో జైత్రయాత్ర నిర్వహించబోతున్నారంటూ ఇటు జనసేన, అటు బీజేపీ ప్రకటించడం రాజకీయ వర్గాల్ని విస్మయ పరిచింది. సాధారణంగా ఎన్నికల్లో గెలిచాక జైత్రయాత్రలు నిర్వహిస్తుంటారు. ఎన్నికల్లో గెలవడానికి జైత్రయాత్రలు నిర్వహించడమేంటబ్బా.? ఏమోగానీ, ఇది రాజకీయంగా తమ తొలి ప్రయాణమని బీజేపీ చెబుతోంది.. ఎన్నికల పరంగా. మిత్రపక్షం జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేస్తోన్న తొలి ఎన్నిక కావడంతోనే జైత్రయాత్ర ప్రారంభమవుతోందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాస్తవానికి పంచాయితీ ఎన్నికల్లోనూ బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జనసేన తమ అభ్యర్థిని నిలబెడితే, బీజేపీ మద్దతిచ్చింది. మునిసిపల్ ఎన్నికల సంగతి సరే సరి. పంచాయితీ ఎన్నికలంటే పార్టీ గుర్తు లేకుండా జరిగాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్నీ పక్కన పెట్టేద్దాం. మునిసిపల్ ఎన్నికల్లో ఏం సాధించారు.? తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ – జనసేన ఎందుకు గట్టిగా నిలబడలేకపోయాయి.? ఇక్కడ ఇరు పార్టీల మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువే వుంది. ఆ గ్యాప్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికతో తగ్గుతుందని బీజేపీ భావిస్తోంది. జనసేన అయితే, బీజేపీతో కలవడం వల్ల తమకు నష్టమే తప్ప, లాభం లేదనే భావనతో వుంది. కానీ, సార్వత్రిక ఎన్నికలొచ్చేదాకా తప్పదు.. రాజకీయం ఇలాగే చేయాలి. ఎందుకంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చాలా సినిమాల్ని ఒప్పుకున్నారు. నిజానికి ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలవుతోంది గనుక, పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించబోయే జైత్రయాత్ర.. పవన్ సినిమా ప్రమోషన్ కోసం కూడా ఉపయోగపడుతుందన్నమాట. పరోక్షంగా అది జనసైనికుల్లోనూ, బీజేపీ కార్యకర్తల్లోనూ ఊపు తెస్తుంది. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కూడా, ‘వకీల్ సాబ్’ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.