రేవంత్ రెడ్డి ‘టీ’ కప్పులో చల్లారిన జగ్గారెడ్డి తుపాను.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తుపాను చల్లారింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తన తప్పు తెలుసుకున్నారు. ‘సమాచార లోపం వల్ల అనకూడని మాటలు అనేశాను. రేవంత్ రెడ్డి తప్పేమీ లేదు. ఈ విషయంలో తప్పంతా నాదే. నేనే తొందరపడ్డాను..’ అంటూ జగ్గారెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు, జగ్గారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారంటూ జగ్గారెడ్డి మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలామంది ఫెయిల్ అయ్యారు. ఈ వ్యవహారంపై తాడో పోడే తేల్చుకునేందుకు జగ్గారెడ్డి సిద్ధం కాగా, ఆయన్ని కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారించారనీ, ఆయనకు సుద్దులు చెప్పారనీ, దాంతో జగ్గారెడ్డి మెత్తబడ్డారనీ అంటున్నారు.

జగ్గారెడ్డి అంటేనే, అగ్రెసివ్ నేచర్ కలిగిన పొలిటీషియన్. అయితే, రేవంత్ రెడ్డి అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాకనే, కాంగ్రెస్ అధిష్టానం వద్ద తన ‘బలాన్ని’ నిరూపించుకుని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాది అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటోళ్ళే రేవంత్ రెడ్డి రాజకీయం ముందు తలొంచక తప్పని పరిస్థితి. జగ్గారెడ్డి వ్యవహారం అంత సీరియస్ కాదని రేవంత్ వర్గం నిన్నటి నుంచే లైట్ తీసుకుంది. కానీ, పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇమేజ్ పలచబడకూడదన్న కోణంలో జగ్గారెడ్డితో క్షమాపణ చెప్పించేదాకా పరిస్థితిని తీసుకొచ్చారు. అయినా, జగ్గారెడ్డి ఎందుకు సైలెంటుగా తప్పుని అంగీకరించినట్టు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు.