జగ్గారెడ్డి తెలుసు కదా.. సంగారెడ్డి ఎమ్మెల్యే. తాజాగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. దాంట్లో ఓ వింత ప్రతిపాదనను సోనియా ముందు ఉంచారు. తెలంగాణ పీసీసీ కమిటీ ఏర్పాటుపై ఆయన కొన్ని సూచనలు చేశారు.
పీసీసీ కమిటీలో నియమించే నేతలు ఆర్థికంగా బలంగా ఉండాలని.. అందుకే.. పీసీసీ కమిటీలో 25 మందిని.. వాళ్లు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలని జగ్గారెడ్డి లేఖలో పేర్కొన్నారు.
పీసీసీ కమిటీలో నియమించిన తర్వాత.. ప్రతి నాయకుడికి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించాలని.. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను వాళ్లకే వదిలేయాలని జగ్గారెడ్డి ఈసందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అయితే.. ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని.. తనకు తోచిన ఆలోచినను హైకమాండ్ తో పంచుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
అలాగే.. పీసీసీ చీఫ్ ను ఎన్నుకునే ప్రక్రియలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని సోనియా, రాహుల్ ను జగ్గారెడ్డి కోరారు. కొందరు నాయకులు ఈ విషయంలో లాబియింగ్ కు పాల్పడుతున్నారని.. దానికి హైకమాండ్ దయచేసి లొంగకూడదంటూ ఆయన కోరారు.
పార్టీ కోసమే దశాబ్దాల పాటు పనిచేసిన, ఎంతో విధేయతతో పనిచేసిన నాయకులను, వారి సామర్థ్యాన్ని అంచనా వేసి పీసీసీ చీఫ్ ను ఎన్నుకోండి.. అంటూ జగ్గారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. మరి.. జగ్గారెడ్డి సూచనలను సోనియా, రాహుల్ పరిగణనలోకి తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు.. రేవంత్ రెడ్డే టీపీసీసీ చీఫ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.