టీపీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ చాలానే కసరత్తు చేస్తోంది. వరుసగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఓడిపోతుండటం.. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే ఓటమి చవిచూడటంతో నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ గా ఎవరిని నియమిస్తే బాగుంటుంది.. అనే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు వచ్చే టీపీసీసీ చీఫ్ 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అందుకే.. కాస్త ఆచీతూచీ అడుగేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
అయితే.. టీపీసీసీ చీఫ్ రేసులో ముఖ్యంగా కొందరి పేర్లు అయితే ప్రముఖంగా వినిపించాయి. రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పేర్లు వినిపించాయి. దీంతో టీపీసీసీ చీఫ్ గా ఎవరిని హైకమాండ్ నియమిస్తుందోనని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి పేరు కన్ఫమ్ అయిందని.. డిసెంబర్ 31న సోనియా గాంధీ.. తన పేరును ప్రకటిస్తారని అంతా అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డే నెక్స్ ట్ టీపీసీసీ చీఫ్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీపీసీసీ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ పదవి కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తా. కానీ.. ఆ నిర్ణయం వల్ల పార్టీలో ఉన్న నాయకులు, పార్టీ చీలిపోకుండా ఉండాలి. అటువంటి నిర్ణయం జరగాలని నేను ఆశిస్తున్నా.. అంటూ జగ్గారెడ్డి అన్నారు.
అయితే.. సోనియా గాంధీకి వెళ్లిన లిస్టులో… జగ్గారెడ్డి పేరు లేదు. కేవలం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు మాత్రమే సోనియాగాంధీ దగ్గరకు వెళ్లాయట. దీంతో జగ్గారెడ్డి ఒకింత అసంతృప్తికి లోనయినట్టు తెలుస్తోంది.