151 మంది ఎమ్మెల్యేలు, లెక్కకు మించినంతమంది నేతలు, టీడీపీ నుండి పెరుగుతున్న వలసలు, కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలు.. ఇది క్లుప్తంగా చెప్పాలంటే వైసీపీ సిట్యుయేషన్. వలస నేతలతో ఏ పార్టీలోనైనా లుకలుకలు రావడం కామన్. వాటికవే సర్దుకుంటే సర్దుకున్నట్టు లేకపోతే హైకమాండ్ రంగంలోకి దిగి పరిష్కరిస్తుంది. కానీ అప్పటికీ పరిష్కారం కాకపోతే, అలాగని వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ నియోజకవర్గంలో పార్టీ ముక్కలైపోతుంది. ఇప్పుడు ఇదే పరిణామానికి గన్నవరం వైసీపీ దగ్గర్లో ఉందని అంటున్నారు శ్రేణులు.
గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నేత వల్లభనేని వంశీ వైసీపీలోకి అనధికారికంగా చేరిన సంగతి తెలిసిందే. అలా వెళ్లిన ఆయన నిదానంగా ఏమైనా ఉన్నారంటే లేదు. అంతా నాదే, అన్నీ నేనే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. గన్నవరం అసెంబ్లీలో కీలకమైన వైసీపీ నేతలు దుట్టా రామచంద్రరావు, మార్లగడ్డ వెంకట్రావు. వీరిద్దరికీ వంశీ పార్టీలోకి రావడం ఇష్టంలేదు. అందుకు బలమైన కారణమే ఉంది. గత ఎన్నికల సమయంలో వంశీ దూకుడు కారణంగా వీరిరువురూ అష్ట కష్టాలు పడ్డారు. అందుకే ఆయన రాక వారికి సహించడంలేదు. పైగా వంశీ సపరేట్ వర్గాన్ని కూడగట్టి రాజకీయం చేస్తుండటం, పార్టీకి సంబంధించిన అన్ని ముఖ్య వ్యవహారాల్లో తానే కీలకంగా ఉండటం, ఆ ఇద్దరి నుండి శ్రేణులను లాక్కోవాలని చూస్తుండటంతో వీరి కోపం మరింత పెరిగింది.
తాజాగా తన పుట్టినరోజు వేడుకలకు పోలీసులు అడ్డు చెప్పడంతో దాని వెనుక వంశీ ఉన్నారని అంటూ యార్లగడ్డ బయటికొచ్చి మరీ ఆయనతో పనిచేసేదే లేదని, ఈ విషయాన్ని జగన్‌తో కూడ చెప్పేశానని అన్నారంటే ఆయన కోపం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఇక దుట్టా వర్గమైతే వంశీ మీద ఎత్తిన కత్తి దించట్లేదు. గన్నవరం వైసీపీలో ఎవరైనా ఒక్కరే ఉండాలి అన్నట్టు ఉన్నారు. చూస్తుండగానే జఠిలమైపోయిన ఈ సమస్య జగన్‌కు కూడ అంత ఈజీగా లోగేలా కనిపించట్లేదు. ఎందుకంటే ముగ్గురూ కీలక నేతలే. అటు ఇటుగా సమానమైన బలం ఉన్నవారే. ఎవరిని కాదన్నా రెండోవారు వ్యతిరేకులైపోతారు. పార్టీలో ఉంటూనే ముసలం పుట్టిస్తారు. అది నియోజకవర్గంలో పార్టీ ఉనికికే కష్టమైపోతుంది. చూడబోతే వలసలు తెచ్చే కష్టాలు జగన్‌కు గన్నవరం నుండే మొదలయ్యేలా ఉన్నాయి.