రాజకీయాలు అంటే కక్ష సాధింపులు ఉండటం సర్వసాధారణమే.. కానీ ఏపీ రాజకీయాల్లో ఈ మోతాదు కాస్త ఎక్కువైనట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ వైసీపీ.. ప్రతిపక్షం టీడీపీల మధ్య వైరం ఎంతలా పెరిగిపోయిందో అందరికి తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఒకరు చేసిన అక్రమాలను ఒకరు బయట పెట్టడం, ఒకరి వెనుక ఒకరు గోతులు తీయడం కామన్‌గా మారిపోయింది.. ఈ సమయంలో చంద్రబాబు చేసిన అక్రమాలు అంటూ, అధికార పార్టీ ఎన్నో ఆరోపణలు చేస్తు నిజాలను వెలికి తీస్తుంది.. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఆరోపణ ఏంటంటే అమరావతి రైతులను టీడీపీ ప్రభుత్వం నిలువునా ముంచేసింది అని వైసీపీ ప్రభుత్వ వాదన. ఇందుకు అనుగుణంగానే ఈ ప్రాంతంలో చంద్రబాబు హయాంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది వైసీపీ సర్కారు ఆరోపిస్తూ, ఓ సిట్ కూడా వేసి, దీని పై పరిశీలన జరిపి ఓ నివేదిక సమర్పించింది.. అయితే దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో, హైకోర్టు ఆ సిట్‌ను కొట్టేసి, విచారణ నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వగా ఇది కాస్తా వివాదాస్పదమైంది.
ఇక ఈ విషయంలో ఎలాగైనా చంద్రబాబుకు ఉచ్చు బిగించాలని చూస్తున్న జగన్ టీమ్ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతోందట.. అదేంటంటే.. ఈ ప్రాంతంలో జూన్ 1, 2014 నుంచి డిసెంబరు 31 వరకూ జరిగిన భూముల క్రయవిక్రయాలను మంత్రివర్గ ఉపసంఘం.. రాజధాని నగరం, ప్రాంతం కింద ప్రకటించిన ప్రాంతాలుగా పరిగణనలోకి తీసుకుని, వాటికి సంబంధించిన రికార్డులను పరిశీలించి నివేదిక తయారు చేసింది. అందులో ప్రకారం.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందుగా సమాచారం తెలిసినవారు 4069 ఎకరాలను కొన్నారని తేల్చింది.. ఇదిలా ఉండగా రాజధాని ఎక్కడ ఏర్పడుతుందో అనే విషయాన్ని రహస్యంగా తెలుసుకుని ఆ ప్రాంతంలో ముందుగా భూములు కొనడం నేరం అవుతుంది.
అయితే.. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని తాము భావిస్తున్నట్లు 2014 జులై 22న రాష్ట్ర ప్రభుత్వం, రాజధానిపై ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఛైర్మన్, మంత్రి డాక్టర్ పి.నారాయణ ఢిల్లీలో చెప్పారు. అదే రోజు రాజధానిపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులకు కూడా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే అమరావతి ప్రాంతంలో 2014 జూలై 22నే రాజధాని వస్తుందనే సమాచారం ప్రజలకు చేరింది.
ఈ క్రమంలో జూలై 22 తర్వాత ఎవరైనా భూములు కొంటే అది తప్పెలా అవుతుంది. ఎక్కడైనా ఓ ప్రాజెక్టు వస్తుంటేనో.. వేరే ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఉంటే ఆ చుట్టుపక్కల భూముల ధరలు పెరగడం సర్వ సాధారణమే కదా. ఇదే గాక అమరావతి భూముల విషయంలో 24వేల ఎకరాల భూస్కామ్ జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. తమ అధికార పత్రికలో 600 ఎకరాలకు పరిమితం చేశారని.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చిన వివరాలు చూస్తే 125 ఎకరాలే అని తేలిందనే విషయాన్ని మరచినట్లుగా ఉన్నారు.. ఇదే కాకుండా రాజధాని ప్రకటన వెలువడ్డాక జరిగిన భూముల కనుగోళ్లు అక్రమం కాదనే లాజిక్ కూడా మిస్ అవుతున్నారు..