తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ దుబ్బక ఉప ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి బీజేపీ విజయపథకాన్ని ఎగురవేసింది. అయితే ఇప్పుడు ఈ ఫలితాలు తిరుపతిలో ఎంపీ సీట్ కోసం జరగనున్న ఉప ఎన్నికల వ్యూహాలను కూడా ప్రభావితం చేసింది. ఇక్కడ వచ్చిన ఫలితాలను చూసి వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నూతన వ్యూహానికి తెరతీశారు.
నూతన వ్యూహం రచించిన జగన్
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎట్టిపరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలిచి తీరాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. తిరుపతి సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమయింది. సంప్రదాయంగా మరణించిన సభ్యుల కుటుంబాలకే టిక్కెట్ ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సానుభూతి ఓట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ ఇదే విషయం స్పష్టమయింది. దీంతో తిరుపతి ఉప ఎన్నికపై జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. అయితే ఇది ఫైనల్ నిర్ణయం కాదని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు శాసనసభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశమైన తర్వాత దీనిపై ఫైనల్ డెసిషన్ కు వస్తారని అంటున్నారు.
తిరుపతి ఎన్నికలు జగన్ పాలనకు సంకేతమా!!
తిరుపతిలో జరగనున్న ఎన్నికలను వైసీపీ పాలనకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీలు చూపుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితం ఇప్పటి వరకు జగన్ పాలనపై ప్రజలకు ఉన్న అభిప్రాయం వెల్లడి అవుతుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకే వైసీపీ నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు.