Jansenani Pawan Kalyan : దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు అవేవో మొరిగినట్టు.. అని పెద్దలు అంటుంటారే.! ఆంద్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయాక, ఇప్పుడు తీరిగ్గా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ జిల్లాల విభజన సరిగ్గా జరగలేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జిల్లాల స్వరూప స్వభావాల విషయమై వైఎస్ జగన్ సర్కారు, ముందుగానే సమాచారమిచ్చింది. అభ్యంతరాల స్వీకరణ కూడా చేపట్టారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కొన్ని మార్పులు కూడా చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి కేవలం వేలల్లో మాత్రమే అభ్యంతరాలు రావడం గమనార్హం. అంటే, ప్రజల్లో జిల్లాల విభజనపై పెద్దగా అభ్యంతరాల్లేవన్నమాట. కొన్ని రాజకీయ పార్టీలు కొంత రాజకీయం చేశాయి.
అలా రాజకీయం చేసినవారిలో వైసీపీ నాయకులు కూడా వున్నారు. కానీ, ప్రభుత్వం అత్యంత శాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ తరఫున జిల్లాల విభజన విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చిత్తశుద్ధితోనే అనుకుని వుంటే, ఆయనెప్పుడో ఆ పని చేసేవారే. కానీ, అలా చేయలేదాయన. ఇప్పుడెందుకు ఈ యాగీ.?
కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై కొంత అభ్యంతరాలు వ్యక్తమైన మాట వాస్తవం. వాటి విషయమై ప్రభుత్వం సమాలోచనలు చేసి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. కొన్నిటిని పరిష్కరించింది, కొన్నిటి విషయంలో వెనక్కి తగ్గలేదు.
పనంతా పూర్తయిపోయాక, అధికారిక ప్రకటన వచ్చేశాక.. ఇప్పుడు జనసేనాని అభ్యంతరాలు వ్యక్తం చేసి ఏం ప్రయోజనం.? నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు.. అన్నట్టు, ఈ విషయంలో జనసేనాని.. ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఉపయోగం లేదంతే.