కేసీఆర్.. ఎదుటివాళ్లు ఎవరైనా కానీ.. తనకు కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా వాళ్ల మీద ఉన్నది లేనిది అంతా మాట్లాడేస్తారు. కేసీఆర్ ముక్కుసూటి మనిషి. ఏది ఉన్నా మనసులో దాచుకోరు. ప్రెస్ మీట్లలోనూ ఆయన మాట్లాడే తీరును అందరూ గమనిస్తూనే ఉంటారు. పట్టుపడితే వదలని విక్రమార్కుడు కేసీఆర్. ఆ విషయం తెలంగాణ సాధనలోనే అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో తిరుగులేదంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యం అయింది.
2014 ఎన్నికల్లో మొదటి సారి అధికార పీఠం ఎక్కాక.. బీజేపీతో దోస్తీ చేశారు కేసీఆర్. అప్పుడు కేంద్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో బీజేపీతో కాస్త సన్నిహితంగానే ఉన్నారు.
అయితే.. బీజేపీ తెలంగాణలోనూ బలపడటానికి ప్రయత్నిస్తోంది. ఆ విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. రోజురోజుకూ తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది. ఇదే.. కేసీఆర్ కు కంటకంగా మారింది. కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేసిన కేసీఆర్.. లోకల్ గా తెలంగాణలో బీజేపీ నేతలతో అలా ఉండలేకపోయారు.
అప్పట్లో కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినా.. చివరకు ప్రధాని మోదీ కూడా తెలంగాణకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ను పొగడ్తల్లో ముంచెత్తారు. కేసీఆర్ కూడా బీజేపీని ఆకాశానికెత్తారు.
కానీ.. రోజులు మారాయి.. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ బద్ధశత్రువులు అయిపోయాయి. 2018 ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ బీజేపీపై దూకుడు పెంచారు. బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నిస్తోందని.. 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్తోందని గ్రహించిన కేసీఆర్.. ఏకు మీద మేకు అయ్యారు.
వెంటనే బీజేపీపై విమర్శల వర్షం కురిపించడం ప్రారంభించారు. కేంద్రంతోనూ అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన హామీల విషయంలోనూ కేసీఆర్ గుర్రుగానే ఉన్నారు. జీఎస్టీ బకాయిలు కూడా కేంద్రం విడుదల చేయకపోవడంతో కేంద్రాన్ని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే.. తెలంగాణలో బీజేపీ పట్టు సాధించకూడదని.. బీజేపీని తెలంగాణలో భూస్థాపితం చేయాలని.. అందుకే కేసీఆర్ బీజేపీతో వైరం పెట్టుకుంటున్నారని.. బీజేపీని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించి.. పార్టీని తెలంగాణ నుంచి తరిమికొట్టాలన్నదే కేసీఆర్ సీక్రెట్ ప్లాన్.. అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.