ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ మాటల్ని అన్నారా.? లేదా.? అన్నదానిపై తీవ్ర గందరగోళం వుంది. కానీ, టీడీపీ అనుకూల మీడియాలో అయితే, ఆ వ్యాఖ్యలు ప్రముఖంగానే వచ్చాయి. ‘తెలంగాణలో సీమాంధ్రులున్నారు. వారి కోసం ఆలోచిస్తున్నాం..’ అంటూ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వివాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారన్నది ఆ కథనాల సారాంశం. ఈ వ్యవహారంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.
తెలంగాణలో వున్న సీమాంధ్రులకు వచ్చిన సమస్య ఏమీ లేదని స్పష్టం చేసేశారు. ‘మీరు తెలంగాణలో వుంటున్నారు.. తెలంగాణ తరఫున మీరు మాట్లాడతారని విజ్ఞప్తి చేస్తున్నాం..’ అంటూ తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు శ్రీనివాస్ గౌడ్. గడచిన ఏడేళ్ళలో తెలంగాణలో సీమాంధ్రులకు వచ్చిన ఇబ్బంది నిజంగానే ఏమీ లేదు. కరోనా మొదటి వేవ్ సమయంలో, పెద్దయెత్తున సీమాంధ్రులు వైద్య చికిత్స కోసం తెలంగాణకి వచ్చారు. ఇక, రెండో వేవ్ సమయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో తెలంగాణ వచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సీమాంధ్రులకు షరతులు విధించింది. అందుక్కారణం, తెలంగాణలో కరోనా వ్యాప్తిని అదుపులోకి తీసుకురావడమే అయినా, కోర్టు జోక్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఫలించలేదనుకోండి.. అది వేరే సంగతి.
ఏదిఏమైనా, ఇది చాలా సున్నితమైన అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు పొందితే, తమకేమీ అభ్యంతరం లేదని తాజాగా శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అన్ని అనుమతులూ సంపాదించుకోగలిగితే, ఒకవేళ ఖర్చు విషయమై ఆంధ్రపదేశ్ ఏమైనా ఇబ్బంది పడితే, తాము సహకరిస్తామని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు.అలాంటప్పుడు, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీకి ఆస్కారమేముంటుంది.? ఎక్కడో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడింది. దాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీలైనంత త్వరగా తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి తగ్గించుకోవాలి.