శ్రీధర్ బాబుపై కుట్ర జరుగుతుందా..?

mla sridhar babu telugu rajyam

 తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో చెప్పుకోదగిన నేత శ్రీధర్ బాబు. బలమైన రాజకీయ నేతగా, మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథిని నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నాడు. గత ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ నుండి కాంగ్రెస్ తరుపున గెలిచిన ఒకే ఒక్క నేత శ్రీధర్ బాబు. తెలంగాణ లో పీసీసీ అధ్యక్ష పదవి మార్పు ఉండబోతుందని తెలిసిన నాటి నుండి శ్రీధర్ బాబు పేరు కూడా ఇందులో వినిపిస్తుంది. ఆయన ఢిల్లీ స్థాయిలో పీసీసీ పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి.

sridhar babu kcr telugu rajyam

 

  ఈ మధ్య కాలంలో మరికొన్ని ఆరోపణలు కూడా శ్రీధర్ బాబు మీద వినిపిస్తున్నాయి. అదేమిటంటే శ్రీధర్ బాబు వచ్చే మార్చి నాటికీ తెరాస పార్టీలో చేరబోతున్నాడని, అందుకోసం ఇప్పటినుండే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అంటూ గుసగుసలు మొదలయ్యాయి. ఈటెల రాజేందర్ సహకారంతో శ్రీధర్ బాబు తెరాస కండువా కప్పుకుంటున్నాడు అంటూ బలమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన అనుచర వర్గం మాత్రం గట్టిగా మాట్లాడుతూ, శ్రీధర్ బాబు పీసీసీ రేస్ లో ఉండటంతోనే ఆయన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక తెరాస మరియు కాంగ్రెస్ పార్టీలోని నేతల ప్రమేయం కూడా వుంది. శ్రీధర్ బాబు తమకి ఎక్కడ పోటీ అవుతాడేమో అని భావించి, ఆయనకు పీసీసీ పదవి రాకుండా చేయటం కోసమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ అయన వర్గం మండిపడుతుంది.

 అయితే గతంలోనే శ్రీధర్ బాబు తెరాస లో చేరబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు కొందరు తెరాస తీర్థం పుచ్చుకున్నారు, వాళ్ళతోనే శ్రీధర్ కూడా వెళ్ళిపోతున్నాడు అనే వార్తలు వచ్చాయి, కానీ ఎందుకో శ్రీధర్ కాంగ్రెస్ లోనే వున్నాడు. మళ్ళీ తాజాగా ఇప్పుడు అలాంటి ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై శ్రీధర్ బాబు స్పదించకుండా మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. అయితే ప్రస్తుతం శ్రీధర్ బాబు మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని, అందుకు తగ్గ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తనమీద ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టేది లేదని శ్రీధర్ బాబు అన్నట్లు అయన వర్గం చెపుతుంది. మరి అందులో నిజమెంత ఉందొ..? వాళ్ళకే తెలియాలి…. నిప్పు లేనిదే పొగరాదనే సామెత ఊరికే చెప్పలేదు పెద్దలు. కాబట్టి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విషయంలో నిప్పు ఎక్కడో రాజుకున్నట్లు తెలుస్తుంది.