తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితో అయినా రాజకీయంగా కొట్లాటకు సిద్ధమేనని గతంలోనే తేల్చి చెప్పేశారు వైఎస్ షర్మిల. ఖమ్మం వేదికగా గతంలో షర్మిల చేసిన ప్రసంగంతోనే ఆ విషయం స్పష్టమైపోయింది.
మరిప్పుడు, తెలంగాణ – ఆంధ్రపదేశ్ మధ్య నీటి వివాదం తలెత్తిన దరిమిలా, ఈసారి నీటి యుద్ధం చేయాల్సి వస్తే.. షర్మిల, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రాజకీయంగా తలపడతారా.? లేదంటే, అక్కడున్నది సొంత అన్న కాబట్టి లైట్ తీసుకుంటారా.? ఈ ప్రశ్నకు షర్మిల సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదంటూ, పాత వీడియోని షేర్ చేశారు.
నిజానికి, తెలంగాణ – ఆంధ్రపదేశ్ మధ్య నీటి వివాదం.. కేవలం రాజకీయ పార్టీల కల్పితం. తెలంగాణకు నీళ్ళు వుండకూడదని ఆంధ్రపదేశ్ ప్రజలు కోరుకుంటారా.? ఆంధ్రపదేశ్ ప్రజల గొంతు ఎండిపోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారా.? తెలంగాణలో సీమాంధ్రులు చాలామందే వున్నారు.
కరోనా నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి వెళ్ళి వైద్య చికిత్స పొందినవారూ వున్నారు. అందరం భారతీయులమే.. మేం ఫలానా రాష్ట్రానికి చెందినవారం.. అంటూ, ఇంకొకరి మీద ద్వేషం వ్యక్తం చేసే పరిస్థితి వుండదు. ఇక, నీటి ప్రాజెక్టుల వివాదం విషయానికొస్తే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వివాదం తెరపైకొచ్చింది.
అప్పట్లో వైఎస్సార్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే తెలంగాణ ఉద్యమానికి అప్పట్లో కొత్త ఊపిరి.. అని అంటారు చాలామంది. మరి, రాజశేఖర్ రెడ్డి చేసింది పెద్ద తప్పిదమని షర్మిల అనగలరా.? అలా అనాల్సి వస్తే, షర్మిల పెట్టబోయే పార్టీలోంచి వైఎస్సార్ ఫొటో, పేరు లేకుండా పోతాయా.? కాలమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివి.