వైసీపీని వెనక్కి నెట్టేస్తోన్న ప్రశాంత్ కిషోర్.?

‘వ్యక్తిగతంగా అయితే, పార్టీ అధినేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు నాకు ఉచిత సలహాలు ఇచ్చినా, వాటిని స్వీకరించాలనుకోను.. కానీ, తప్పదు.. అధినేత వైఎస్ జగన్ ఆదేశించారు కాబట్టి, ఎవరితో అయినా కలిసి పని చేస్తాను..’ అంటూ నెల్లూరు జిల్లాకి చెందిన వైసీపీ కీలక నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ‘ప్రశాంత్ కిషోర్ పెత్తనం’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులు, ముఖ్య నేతల వెంట ఐ ప్యాక్ టీమ్ సభ్యుడొకరు వుంటారు.. మీ పని తీరుని పరిశీలిస్తారు, నివేదికను నాకు అందిస్తారు..’ అంటూ నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘వర్క్ షాప్’ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

అసలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల వెనుక, ఇలాంటి సలహాదారుల తాలూకు మనుషులు ఎందుకు వుండాలి.? అంటే, ఇప్పుడు నడుస్తున్నవి కార్పొరేట్ రాజకీయాలు. ప్రజలకు ఎంత మంచి చేసి గెలవాలి.? అన్నది గతం. ఇప్పడు ఏం మాయ చేసి గెలవాలి.? అన్నదే లక్ష్యం. సరే, వైసీపీ చెబుతోన్న సంక్షేమాన్ని తప్పు పట్టలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.

అదే సమయంలో, గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులూ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలో. అటు సంక్షేమం, ఇటు అప్పులు.. ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్థితి. అప్పులు చేసి, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, దాని వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఏమన్నా లాభం.? ఏమీ వుండదన్నది ఆర్థిక రంగ నిపుణుల వాదన.

ఎవరు అధికారంలో వున్నా, సంక్షేమంపై స్వారీ చేయాల్సిందే. సంక్షమాన్ని పక్కన పెడితే అధికారం దక్కదు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిస్థితి మరీ భయంకరంగా తయారైంది. ‘సోమరితనం’ అనేది ఎక్కువైపోవడం వల్లే ఈ దుస్థితి అంటారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి గోల వారిదే.

ఇంతకీ, ఐప్యాక్ టీమ్ సభ్యులు తమ వెంట ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కనిపిస్తే, తమ పని తీరుకి మార్కులేస్తోంటే, ఎమ్మెల్యేలు.. మంత్రలు ఎలా ఫీలవుతారు.? ప్చ్.. తట్టుకోవడం కష్టమే.! 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్, ఇప్పుడు వైసీపీని వెనక్కి నడిపిస్తున్నట్లగా కనిపిస్తోంది పరిస్తితి.