చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా సమస్యలున్నాయి. అన్నిటికీ మించి అధికార వైసీపీ చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. మూడు రాజధానుల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి.? చేస్తున్న అప్పులకు ఎలా సమాధానం చెప్పాలి.? పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలి.? ఇలా ఇన్ని ప్రశ్నలు, సవాళ్ళను ముందరేసుకుని, అర్థం పర్థం లేని అంశాలపై రాజకీయ విమర్శలు చేస్తూ అధికార వైసీపీ టైమ్ పాస్ చేస్తోంది.

మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫన్నీ విమర్శలు చేశారు. చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారన్నది పేర్ని నాని ఉవాచ. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములు.. అది ఆ ఇద్దరి మధ్య పంచాయితీ. వాళ్ళిద్దరి విషయంలోకి పేర్ని నాని ఎందుకు తొంగి చూడటం.?

ఏనాడైనా, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి విమర్శలు చేశారా.? అంటే, లేదాయె.! నాగబాబు గతంలో ‘మా తమ్ముడ్ని మేం పిలిస్తే రావడంలేదు.. చేతనైతే మీరు పిలవండి..’ అంటూ ఓ సినిమా ఫంక్షన్‌లో ఒకింత ఆవేశపడ్డారుగానీ, చిరంజీవి ఏనాడూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని ఏమీ అనలేదు. పైగా, ‘నా తమ్ముడు.. నా కొడుకు లాంటోడు.. వాడిదీ నాది రాజకీయంగా ఒకటే ఆలోచన.. కాకపోతే దారులు వేరు.. లక్ష్యం ఒకటే..’ అని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారు.

చిరంజీవినీ పవన్ కళ్యాణ్‌నీ వేరు వేరుగా చూపి, కాపు సామాజిక వర్గంలో ఓట్ల చీలిక కోసం, మెగాభిమానుల్లో చీలిక కోసం పేర్ని నాని ప్రయత్నించొచ్చుగాక. కానీ, అది వృధా ప్రయాస. పైగా, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే అది వైసీపీకే పెద్ద సమస్యగా మారుతుంది.

వైఎస్ జగన్ కుటుంబంలో రాజకీయ విభేదాలున్నాయి. అన్నని కాదని వైఎస్ షర్మిల తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఏ పార్టీకి అయితే గౌరవాధ్యక్షురాలిగా వున్నారో, ఏ పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యేగా గతంలో గెలిచారో.. ఆ పార్టీని వదిలేశారు వైఎస్ విజయమ్మ.

వైసీపీ నుంచి వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఇద్దరు వేరు కుంపటి పెట్టారు. దీన్ని వెన్నుపోటు అని ఎందుకు అనకూడదన్న ప్రశ్న సహజంగానే వస్తుంటుంది. ముందైతే సొంత ఇంట్లో కుంపట్లను వైఎస్ జగన్ చల్లార్చుకోవాలని పేర్ని నాని తమ అధినేతకు సలహా ఇవ్వాలిగానీ, చిచ్చు లేని చోట మెగా చిచ్చు రాజేయాలని చూడటం ఎంతవరకకు సబబు.?