మంచు విష్ణు చెప్పేదంతా నిజమేనా.? ఎన్నికల కోసమా.?

సినీ నటుడు మంచు విష్ణు, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లో సొంత ప్యానెల్ ద్వారా ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం విదితమే. మోహన్ బాబు తెరవెనుకాల వుండి కథ నడిపిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం అస్త్రశస్త్రాల్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు మంచు విష్ణు. ఆయన పోటీ పడుతున్నది సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో. అయితే, ఇది యుద్ధం కాదనీ, పోటీ మాత్రమేనని ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఎవరి భావాలు వారికి వుంటాయి.. ఎవరి ఆలోచనలు వారికి వుంటాయ్.. ఎన్నికల్లో రాజకీయాలుండకూడదని మంచు విష్ణు చేసిన వ్యాఖ్యల్ని తాను సమర్థిస్తున్నానని ప్రకాష్ రాజ్ చెప్పడం గమనార్హం. మరోపక్క ప్రకాష్ రాజ్ వెనుక చిరంజీవి వున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ, చిరంజీవి ఓటు తనకే పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మంచు విష్ణు.

చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఓట్లు తనకు ఖాయమైపోయిన్లుగా మంచు విష్ణు చెబుతుండడం గమనార్హం. అయితే, ఇంతవరకు చిరంజీవి.. మా ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తున్నదీ ప్రకటించలేదు.. ఆయన గతంలోనూ ఎవరికీ మద్దతిస్తున్నట్లుగా ప్రకటించింది లేదు. పరిశ్రమ పెద్దగా ఈసారి చిరంజీవికి అన్ని వైపుల నుంచీ తగిన గౌరవం లభిస్తుంది. దాన్ని ఆయన ఓ బాధ్యతగా తీసుకుంటున్నారు కూడా. ఇదిలా వుంటే, మోహన్ బాబు – చిరంజీవి మధ్య విభేదాల్లేవని, అప్పుడప్పుడూ అభిప్రాయ బేధాలు రావడం సహజమేనని మంచు విష్ణు తాజాగా వ్యాఖ్యానించారు. వాళ్ళిద్దరి మధ్యా గొడవలున్నాయని ఎవరైనా భావిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదనీ, ఇద్దరూ మంచి స్నేహితులనీ చెప్పడం ద్వారా మెగా ఓట్లు తనవైపుకు తిప్పుకునేందుకు మంచు విష్ణు ప్రయత్నిస్తున్నట్లే వుంది. అయితే, మంచు విష్ణు చెబుతున్నదే నిజమా.? మోహన్ బాబు – చిరంజీవి మధ్య అసలు విభేదాలే లేవా.? ఎన్నికల కోసమే మంచు విష్ణు ఇలా మాట్లాడుతున్నాడా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.