విశాఖ ఎల్ జీ పాలిమర్స్ లీక్ ఘటనపై, కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తోన్న రాజకీయ కుతంత్రాల గురించి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై విషం చిమ్ముతూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా చంద్రబాబు అండ్ కో వ్యాఖ్యల్ని ఖండిస్తూ వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ప్రపంచమంతా జగన్మోహన రెడ్డి స్పందించిన తీరును మెచ్చుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కోడి గుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాలు చేస్తున్నారన్నారు.
గ్యాస్ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి యుద్ధ ప్రాతిపదికన బాధితులను ఆదుకుని భరోసా నింపారన్నారు. రాష్ర్టం ఆర్ధికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ప్రభుత్వ ఖజానా నుంచి భారీ అర్ధిక సాయం అందించిన ఘనత సీఎం జగన్ దేనన్నారు. దీన్ని చంద్రబాబు మెచ్చుకోక పోగా విమర్శలకు దిగడం సమంజసం కాదన్నారు. ఎల్ జీ పాలిమర్స్ తో లాలూచీ పడ్డారంటున్నారు కదా..అసలు ఆ కంపెనీతో లాలూచీ పడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. వారితో పరిచయం గానీ, బంధం గానీ, జగన్ ప్రభుత్వానికి లేవు. అలాంటి బంధాలు చంద్రబాబుకే ఉంటాయని ఆరోపించారు. కోటి ఇస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? అని చంద్రబాబు ఎలా అంటున్నారో అర్ధం కాలేదన్నారు. ముఖ్యమంత్రి గా పనిచేసిన అనుభవమంతా ఏమైందో అర్ధం కాలేదంటూ అంబటి మండిపడ్డారు.
ఎఫ్ ఐర్ సరిగ్గా కట్టలేదంటున్నారు. అది ప్రాథమిక దర్యాప్తు నివేదిక మాత్రమే. విచారణలో వాస్తవాలు తేలుతాయి. 40 ఏళ్ల ఇండస్ర్టీ అంటున్నారు..ఆ మాత్రం మీకు తెలియదా? కంపెనీ వారిని అరెస్ట్ చేయలదంటున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఎంత మందిని అరెస్ట్ చేసారు? గెయిల్ ప్రమాదంలో మృతులకు 20 లక్షలు పరిహారం ఇస్తే బాబుగారి ప్రభుత్వం ఇచ్చింది 3 లక్షలే. ఈ ప్రమాదంలో చంద్రబాబు ఎంతమందిని అరెస్ట్ చేయించారు అంటూ అంబటి నిప్పులు చెరిగారు.