రైతుల గురించి మాట్లాడే ద‌మ్ము చంద్ర‌బాబుకుందా?

టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నంత‌కాలం రైతు కంట ర‌క్త క‌న్నీరే. నీటి ప్రాజెక్ట్ లు లేవు. రుణ‌మాఫీలు లేవు. అప్పుల బాధ‌లు. ఆత్మ హ‌త్య‌లు. పై పెచ్చు రైతుల‌పై రౌర్జాన్యానికి దిగిన చరిత్ర టీడీపీ సొంతం. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే అక్ర‌మ దాడులు. ఇలా టీడీపీ ఛాన్స్ తీసుకుని మ‌రీ రైతుల‌పై క‌క్ష పూరిత చ‌ర్య‌ల‌కు దిగిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. చివ‌రికి రైతు వ్య‌థ‌ల‌ను అర్ధం చేసుకున్న మ‌రో నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్ర‌భుత్వంపై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేయ‌డం టీడీపీకే చెల్లింది. ఎవ‌రు రైతు నాయ‌కుడు అన్న విష‌యం ప్ర‌జ‌ల‌కి అర్ధ‌మైంది. రైతు సంక్షేమంలో భాగంగా యంగ్ సీఎం ఎన్నో ప‌థ‌కాల‌ను తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

వాటిపైనే విప‌క్ష‌నేత చంద్ర‌బాబు కుట్ర పూరిత రాజ‌కీయాలు చేస్తున్నాడు. తాజాగా చంద్ర‌బాబు ప‌చ్చి అబద్దాలు చెప్పి రైతుల్ని గంద‌ర‌గోళానికి గురి చేయాల‌ని చూస్తున్నార‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు మండిప‌డ్డారు. ద‌మ్ముంటే రైతుల‌కు ఎవ‌రు న్యాయం చేసారా చ‌ర్చ‌కు రావాలంటూ స‌వాల్ విసిరారు. వ‌య‌సు మీద ప‌డిన పెద్దాయ‌న కృష్ణా, రామా అనుకోకుండా దేనికోస‌మో ఆర‌ట‌ప‌డుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. రైతుకు మేలు చేయ‌డ‌మే ధ్యేయంగా జ‌గ‌న్ ప‌ని చేస్తుంటే ఓర్వ‌లేక బాబు ప్రేలాప‌న‌లు చేస్తున్నార‌న్నారు. సీఎంగా బాబు పనికి రాడ‌నే ప్ర‌జ‌లు 23 సీట్లు ఇచ్చార‌ని ఎద్దేవా చేసారు. వారిలో ముగ్గురు ఆయ‌న్ని వ్య‌తిరేకిస్తున్నా ఇంకా ప‌గ‌టి క‌ల‌లు మానుకోలేద‌ని మండిప‌డ్డారు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు రైతుల‌కు ఇచ్చిన హామీ ప్ర్ర‌కారం మాఫీ చేయాల్సిన మొత్తం 87,612 కోట్ల‌యితే అందులో 70 వేల కోట్లు అప్ప‌టి ప్ర‌భుత్వం మింగేసింద‌ని ఆరోపించారు. చివ‌రికి తాను ఇస్తాన‌న్న నాలుగైదు విడ‌త‌ల రుణ‌మాఫీ నిధుల్ని కూడా రైతుల‌కు ఇవ్వ‌లేద‌న్నారు. దానికి భిన్నంగా జ‌గ‌న్ ఇచ్చిన మాట కంటే ఎక్కువ‌గా 13500 ఇస్తున్న మాట నిజం కాదా? ఏడాదికి 12,500 చొప్పున నాలుగేళ్ల‌లో 50 వేలు ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ ఏటా 13,500 చొప్పున ఐదేళ్ల పాటు 67,500 ఇస్తుంటే మీ దిక్కు మాలిన రాజ‌కీయాలేంటి? వీట‌న్నంటికి బాకా కొట్ట‌డానికి కొన్ని డ‌బ్బా మీడియాలు వెంటేసుకుని భ‌జ‌న చేస్తున్నారా? అని కురసాల మండిప‌డ్డారు.