సీనియర్ ఎన్టీఆర్ కు మొండితనం ఎక్కువగా ఉండేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తారనే సంగతి తెలిసిందే. అయితే సీనియర్ ఎన్టీఆర్ తన మొండితనం వల్ల సినిమా షూటింగ్ ను ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఎన్టీఆర్ నిజ జీవితంలో ఈ తరహా ఘటనలు ఎక్కువగానే ఉండటం గమనార్హం. పాత్రకు తగినట్టుగా తనను తాను మార్చుకునే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు.
గుడి గంటలు అనే సినిమాలో కథ ప్రకారం ఎన్టీఆర్ సిగరెట్లు తాగాల్సి ఉంటుంది. 1964 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. రియల్ లైఫ్ లో ఎంతో క్రమశిక్షణతో మెలిగే సీనియర్ ఎన్టీఆర్ సిగరెట్లు తాగడాన్ని అస్సలు ఇష్టపడరు. అయితే ఏదైనా సినిమాలో పాత్ర ప్రకారం సిగరెట్లు తాగాల్సి ఉంటే కచ్చితంగా సిగరెట్లను తాగేవారు. మధుసూధ రావు డైరెక్షన్ లో డూండీ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.
ఒక్కో సిగరెట్ ప్యాకెట్ లో 20 సిగరెట్లు ఉండగా డూండీ, ముళ్లపూడి ఎన్టీఆర్ కోసం తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ లోని రెండు సిగరెట్లను కాల్చారు. సీనియర్ ఎన్టీఆర్ రెండు సిగరెట్లు తగ్గడంతో సీరియస్ అయ్యారు. కొత్త సిగరెట్ ప్యాకెట్ ఇస్తే తప్ప సీనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొననని చెప్పడంతో షాకవ్వడం డూండీ వంతైంది. డూండీ వెంటనే ప్రొడక్షన్ అసిస్టెంట్ ను షాప్ కు పంపగా షాప్ లో ఆ సిగరెట్లు లేవు.
మరో షాప్ కు వెళ్లి ప్రొడక్షన్ అసిస్టెంట్ కొత్త సిగరెట్ ప్యాకెట్ ను తెచ్చి ఇచ్చిన తర్వాతే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణగా ఉండాలని ఈ విధంగా చేశానని నిర్మాతతో చెప్పారు. కొన్ని విషయాల్లో సీనియర్ ఎన్టీఆర్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవారో ఈ ఘటన ప్రూవ్ చేస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.