రూపాయె.! విశ్వ గురు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నట్లు.?

డాలరుతో రూపాయి మారకం విలువ ఎలా వుంటే మనకేంటి.? అని దేశంలో మెజార్టీ ప్రజానీకం అనుకుంటుంటారు. అతి కొద్ది మందికి తప్ప, దేశంలో పెద్దగా ఎవరికీ ఈ విషయమై అవగాహన వుండదు. కానీ, రాజకీయ విమర్శల తాకిడి మాత్రం ఈ రూపాయి చుట్టూ గట్టిగానే వుంటుంది.

‘డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి’ పడిపోవడంపై తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆసక్తికరమైన ట్వీటేశారు. ‘రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. అయినప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో కోసం వెతుకుతున్నారు.. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం.. ఇలా అన్ని ఆర్థిక అవరోధాలకూ యాక్ట్ ఆఫ్ గాడ్ కారణమని చెప్పారు. వివ్వ గురువుని పొగడండి’ అని కేటీయార్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించడం గమనార్హం.

నిజానికి, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం అనేది కొన్ని వర్గాలకు చాలా ఊరట. అందులో సాఫ్ట్‌వేర్ రంగం ముందంజలో వుంటుంది. అదే సమయంలో, ఆ రంగంపైనా పరోక్షంగా నెగెటివ్ ఎఫెక్ట్ కూడా వుంటుంది. డాలర్ల రూపంలో తమకు వచ్చే సొమ్ముల విలువ పెరుగుతుంది.. రూపాయి పతనం వల్ల. కానీ, అదే తిరిగి చెల్లించాల్సి వస్తే తడిసి మోపెడైపోతుంటుంది. అదీ అసలు సమస్య.

రూపాయి పతనం విషయంలో కేంద్రం ఏం చేయగలుగుతుంది.? అంటే, కేంద్రం గ్లోబలైజేషన్ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు రూపాయి పతనానికి కారణమని ఆర్థిక రంగ నిపుణులు కొందరు తరచూ హెచ్చరిస్తుంటారు. కానీ, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా దాన్ని పట్టించుకోరు.

దేశంలోకి పెట్టుబడులు వస్తున్నాయ్.. అదే స్థాయిలో ఉత్పాదకత పెరగాలి.. పెరుగుతోందా.? అంటే, అది మళ్ళీ డౌటే. దేశంలోకి ఇంపోర్ట్స్ పెరిగిపోయి, ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోతోంటే సహజంగానే ఆ ఎఫెక్ట్ దేశ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు స్థిరంగా వున్నా, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటే అంతే సంగతులు.

ఇంతకీ, కేంద్రం ఏం చేస్తోంది.? ఇంకేం చేస్తుంది.. రాజకీయాలు చేస్తుంది. ఔను, ఆ రాజకీయాలు మాత్రమే చేస్తుంది. ‘మేం అధికారంలోకి వస్తే రూపాయి విలువ పెంచే చర్యలు చేపడతాం..’ అని బీజేపీ గతంలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక, రూపాయిని మరింత పతనంలోకి నెట్టేసింది. ఏమో, సెంచరీ దిశగా రూపాయిని బీజేపీ సర్కారు పరుగులు పెట్టిస్తుందేమో.!