Sree Kekha: 1995లో దీపావళి రోజున ఆలయంలో ప్రవేశించండి అనే జీసస్‌కు సంబంధించిన సాంగ్‌ను మొట్టమొదటి సారిగా పాడానని సింగర్ శ్రీలేఖ చెప్పుకొచ్చారు. అప్పట్లో పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేవారమన్న ఆమె, తన తండ్రి మాట మేరకు అది క్రిస్టియన్ సాంగ్ అయితే ఏంటీ, అది కూడా పాటే కదా అని అన్నారని ఆమె చెప్పారు. తనకు మాత్రం క్రాకర్స్ కాల్చుకోవాలని ఉందన్న విషయం ఆయనకు చెబితే, వచ్చినాక కాల్చుకోవచ్చని చెప్పినట్టు ఆమె తెలిపారు. సరేనని స్టూడియోకెళ్లి అన్ని పాటల్లాగే ఆ పాట కూడా పాడేసి వచ్చానని ఆమె చెప్పారు.
ఇక అది జరిగిన రెండు నెలల తర్వాత చూసుకుంటే ఆ పాట చాలా పెద్ద హిట్ అయిందని శ్రీలేఖ చెప్పారు. అంతకు ముందు క్రిస్టియన్ సాంగ్స్ ఎన్ని వచ్చినా వాటన్నింటినీ తిరిగరాసిన పాటగా అది నిలిచిపోయిందనే పేరు తాను పాడిన సాంగ్‌కు వచ్చిందని ఆమె గర్వంగా చెప్పుకున్నారు. అప్పట్లోనే కొన్ని వేల క్యాసెట్లు అమ్ముడుపోయాయని, దాంతో ప్రొడ్యూసర్లు చాలా బిజీ అయిపోయారని ఆమె అన్నారు. దాంతో ఆ పాట పాడింది ఎవరూ అని చాలా మందిని ఆలోచింపజేయగా, తన పేరు తెరమీదికి వచ్చిందని శ్రీలేఖ చెప్పారు.
అలా పాడిన వ్యక్తి హిందువా, క్రిస్టియనా అని వారు ఏమీ చూడలేదని, శ్రీలేఖ పాడితే హిట్ అని మాత్రమే వారు నమ్మారని ఆమె చెప్పారు. ఆ తర్వాత మళ్లీ అదే ఆల్బమ్‌లో వేరే పాట కూడా పాడానని, అది కూడా భారీ హిట్ కావడంతో తన మీద నమ్మకం మరింత ఎక్కువైపోయిందని ఆమె తెలిపారు. అలా తనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఇప్పటివరకు దాదాపు 4వేల వరకు క్రిస్టియన్ సాంగ్స్ పాడానని ఆమె చెప్పారు.
తాను అన్ని పాటలు పాడే సరికి, తాను క్రిస్టియన్‌గా మారిపోయానని చాలా మంది అనుకుంటున్నారు గానీ, తాను పక్కా హిందువునని, మ్యూజిక్‌కి కుల, మత బేధాలు ఏమీ ఉండవని, తాను ఒకవేళ ముస్లింలకు సంబంధించిన పాట పాడితే ముస్లింని అయిపోతానా అని ఆమె ప్రశ్నించారు. ఏదైనా పాటే అని, కాకపోతే తనకు అలా అవకాశం వచ్చి ఎక్కువ పాటలు పాడానని శ్రీలేఖ స్పష్టం చేశారు.