Rocket Raghava: తాను ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటివరకు 18ఏళ్లు అయిందని జబర్దస్త్ ఫేమ్, కమెడియన్ రాకెట్ రాఘవ చెప్పారు. తాను అప్పటికే టీవీ షోల్లో యాంకరింగ్, ఇతర పోగ్రామ్స్‌లో చేస్తూ 7 సంవత్సరాలు అయిపోయాక, ఇక ఇవి పక్కన పెట్టి సినిమాల్లో ప్రయత్నాలు సాగించాలని అనుకున్నట్టు ఆయన తెలిపారు. అదే సమయంలో ఈటీవీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఓ కొత్త షో ప్రారంభిస్తున్నామని, అందులో చేయడానికి ఆహ్వానం వచ్చిందని ఆయన చెప్పారు. అన్నీ మానేసి ఒక రెండు దారి మారుద్దామనుకున్న టైంలో మళ్లీ టీవీకి అంటే ఎలా అని వాళ్లను రిక్వెస్ట్ కూడా చేశానని, దానికి వారు పర్లేదండి ఇది మంచి పోగ్రామ్ చేయండి అని తనను ఒప్పించినట్టు రాఘవ చెప్పారు.
ఇకపోతే జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత వచ్చిన 6గురిలో అందరూ మారుతూ వస్తున్నారని, కానీ తాను మాత్రం అప్పట్నుంచీ అలాగే కంటిన్యూ అవుతున్నానని ఆయన చెప్పారు. అలా ఇంకా తాను కొనసాగుతుండడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పొచ్చు అని వివరణ ఇచ్చారు. అదేమిటంటే వర్క్‌లో సంతృప్తి. కావల్సినంత యాక్టింగ్ చేయొచ్చు. కొత్తగా ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. ఆ వర్క్ సాటిస్‌ఫాక్షన్ ఉంటుందని ఆయన తెలిపారు. నిజం చెప్పాలంటే బయటికి వెళితే ఖాళీ అయిపోతాననే భయం కూడా ఉందని ఆయన చెప్పారు. ఆ రెండు కారణాలతోనే ఇంకా జబర్దస్త్‌లో చేస్తున్నానని రాకెట్ రాఘవ వివరించారు. తనకు సరైన సమయంలో మల్లెమాల వారు తనకు అవకాశం ఇచ్చారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇక మరో విషయానికొస్తే ఇప్పటివరకు చాలా మంది కొత్తవాళ్లు జబర్దస్త్‌కు వచ్చారని ఆయన చెప్పారు. ఎంత మంది వచ్చినా, ఎవరి వెళ్లిపోయినా అందరి నుంచీ ఎంతో కొంత నేర్చుకున్నానని రాఘవ అన్నారు. ప్రారంభంలో అందరూ స్కిట్స్ కొట్టేవారని, కానీ తన స్కిట్స్ మాత్రం అంత పేలకపోయేవని, అప్పుడు అసలు ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించి, ప్రయత్నించి మెల్ల మెల్లగా అలవాటు అవుతున్న టైంలోనే వాళ్లు వెళ్లిపోయారు. కొత్త వాళ్లు వచ్చారు. ఇప్పుడు మళ్లీ కొత్త కొత్త ఆలోచనలు.. మళ్లీ వీళ్లను కూడా ఎదుర్కోవాలి. కాబట్టి వెళ్లిపోయిన వాళ్లనుంచీ, ఇటు వైపు కొత్తగా వచ్చిన వారి నుంచీ తాను చాలా నేర్చుకున్నానని ఆయన వివరించారు.