Art Director Chinnaa: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. 15రోజులు నరకం చూశాం.. చివరికి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా.. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా!

Art Director Chinnaa: ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి జీవితం అనుభవిస్తున్న సమయంలో తనపై ఒక మరక పడిందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా చెప్పారు. డ్రగ్స్ అడిక్ట్ అయ్యారంటూ వచ్చిన ప్రచారం తర్వాత తాను సిట్ ముందు కూడా హాజరు కావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దానికి వెనకాల ఏం జరిగిందో తనకు తెలియదు గానీ, సడెన్‌గా టీవీలో రావడం, అందరికీ తెలియడం అలా చూస్తుండగానే జరిగిపోయానని ఆయన చెప్పారు.

నిజం చెప్పాలంటే తనకు పుట్టినప్పటి నుంచి సిగరెట్ గానీ, డ్రింక్ గానీ అలవాటు లేదని ఆయన స్పష్టం చేశారు. అవి అలవాటు లేకపోయినా ఇది అలవాటు ఉండొచ్చు కదా అనుకుంటారు గానీ, ఆ అవకాశమే లేదని ఆయన నొక్కి చెప్పారు. ఆ యాంగిల్ ఎప్పుడూ తన జీవితంలో లేదని, అసలు తాను ఎప్పుడూ దాని గురించి వెళ్లలేదని ఆయన తెలిపారు. కానీ 15 రోజులు మాత్రం నరక యాతన పడ్డానని చిన్నా చెప్పారు. వాళ్లు తనకు ఫోన్ చేసిన రోజు నుంచి తాను ఇంటారాగేషన్‌ జరిగే రోజు వరకు చాలా ఇబ్బంది పడ్డానని ఆయన తెలిపారు. ఆ 15 రోజులు టీవీల్లో చూపించేది చూసి చాలా బాధపడ్డామని, అది అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తమకు తెలియలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ ఆ సమయంలో మాత్రం తనకు ఓ నలుగురు స్నేహితులు మాత్రం చాలా సపోర్టివ్‌గా నిలిచారని ఆయన గర్వంగా చెప్పారు. వి.వి.చౌదరి, రఘురాజు, కేశవరెడ్డి, కృష్ణ వీరు మాత్రం తనకు ఆ 15 రోజులు అండగా నిలిచారని ఆయన తెలిపారు. ఇకపోతే మొత్తం 12మందికి నోటీసులు ఇచ్చారన్న ఆయన, సిట్ తనను 2గంటల వరకు ప్రశ్నించిందని చెప్పారు. అన్నీ కూడా జెన్యూన్ ప్రశ్నలు వేశారని కూడా ఆయన తెలిపారు.

ఇకపోతే విచారణకు రేపు వెళ్తానన్న రోజు మాత్రం తాను చాలా టెన్షన్ ఫీలయ్యానని, సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో పడ్డానని చిన్నా తెలిపారు. ఆ సమయంలో తన పరిస్థితిని గమనించిన తన భార్య, తనను కంట్రోల్ చేసిందని ఆయన చెప్పారు. ఆ తర్వాత కంట్రోల్ అయ్యానని, నెక్ట్స్ రోజు విచారణకు వెళితే అర్థమైంది.. తాను ఆ పని చేసి ఉంటే తప్పు చేసిన వాడిని అయ్యేవాడినేమోనని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్లు అన్నీ చాలా జెన్యూన్ ప్రశ్నలు అడిగారని ఆయన వివరించారు.